Indonesia Earthquake
ఇండోనేషియా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదయింది. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఎండే నగరానికి ఉత్తర-వాయువ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సముద్ర మట్టానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంపం సంభవించింది.
భూకంపం సముద్ర గర్భంలో రావడంతో ఇండోనేషియా వాతావరణ సంస్థ సునామీ ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
మౌమేర్ రేవు టెర్మినల్ వెయిటింగ్ రూమ్ కూలిపోవడంతో పాటు చాలా ఇళ్లు, పాఠశాలలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే పూర్తి స్థాయి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రధాన భూకంపం తర్వాత మరికొన్ని శక్తివంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత ప్రమాదకరమైన రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉండటంతో ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి. టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం ఢీకొనడం వల్ల ఇక్కడ తరచూ భారీ భూకంపాలు మరియు అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తుంటాయి.
ఆరు నెలలులో ఇది నాలుగో భూకంపం. ఫిబ్రవరిలో తూర్పు జావాలోని పొనోరోగో ప్రాంతానికి సమీపంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా వ్యవసాయ భూముల్లో పగుళ్లు ఏర్పడటమే కాకుండా, ట్రెంగ్‌గాలెక్ రీజెన్సీలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి.
అలాగే ఏప్రిల్ 2న టెర్నెట్ ద్వీపానికి సమీపంలో సంభవించిన భూకంపం వల్ల బాటాంగ్ దువా దీవుల్లో 450 కంటే ఎక్కువ ఇళ్లు, చర్చిలు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. తీరంలో 75 సెంటీమీటర్ల ఎత్తు వరకు చిన్నపాటి సునామీ అలలు ఎగిసిపడ్డాయి. జూన్ 16 న సులవేసిలోని సౌ ఫాల్ట్ లో భూకంపం కారణంగా వందలాది భవనాలు, నివాస గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
IND vs SL : శ్రీలంక స్పిన్ సవాల్‌కు భారత్ రెడీ.. మరి బోణీ కొడతారా ?
