Strait of Hormuz
పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తాత్కాలికంగా విరామం దొరికినట్టే కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత హార్మూజ్ జలసంధి చుట్టూనే ప్రపంచం తిరుగుతోంది. ఎందుకంటే చాలా దేశాలకు కావాల్సిన ముడిచమురు ఈ సంధి గుండానే వారికి చేరాల్సిన పరిస్థితి. అయితే యుద్ధం మొదలైన తర్వాత దీనిని ఇరాన్ మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.
అమెరికా వైఖరిని నిరసిస్తూ ఇరాన్ హార్మూజ్(Strait of Hormuz) జలసంధిని మూసివేయడం, తర్వాత కొన్ని ఆంక్షలతో తెరవడం వంటివి చోటు చేసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా కూడా ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా తెరవలేదు. అయితే అనూహ్యంగా శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్టు ప్రకటించింది.
లెబనాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆ ఒప్పందం అమల్లో ఉన్నంతకాలం హార్మూజ్ జలసంధిని తెరిచే ఉంచుతామని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైన తర్వాత హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు నౌకల రాకపోకలు నిలిచిపోయాయి.
ఫలితంగా పలు దేశాల్లో చమురు సంక్షోభం తలెత్తింది. అయితే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల తర్వాత ఈ పరిస్థితి కొంచెం సద్దుమణిగింది. ఇప్పుడు లెబనాన్, ఇజ్రాయిల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం అమల్లోకి రావడంతో హార్మూజ్ జలసంధి తెరిచివేతకు లైన్ క్లియర్ అయింది.
కాగా ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇరాన్ కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజా పరిణామాలతో శాంతి చర్చల దిశగా మరో కీలక అడుగు పడిందని భావిస్తున్నారు. ఎందుకంటే పాక్ వేదికగా ఇటీవల జరిగిన చర్చల సమయంలో హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచిన తర్వాతే ఇతర డిమాండ్లను పరిశీలిస్తామని అమెరికా ఖరాఖండిగా చెప్పింది.
అయినా సరే ఇరాన్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు లెబనాన్, ఇజ్రాయిల్ సీజ్ ఫైర్ కారణంగా పునరాలోచనలో పడిన ఇరాన్ హార్మూజ్(Strait of Hormuz) విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అమెరికా, ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలకు సంబంధించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Womens Reservation Bill : ఎన్డీఏ ప్రభుత్వానికి షాక్…వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
