Moon : చందమామపై వేలాది పగుళ్లు..భవిష్యత్ మూన్ మిషన్లకు కొత్త తలనొప్పి..

Moon : వయసు పెరిగే కొద్దీ మనుషుల చర్మంపై ముడతలు పడినట్లే, చంద్రుడి బాహ్య కవచంపై కూడా వేలాదిగా పగుళ్లతో పాటు కొండచరియల వంటి వింత నిర్మాణాలు ఏర్పడుతున్నాయి.

Moon

రాత్రి వేళ ఆకాశంలో వెండిలా మెరిసే చందమామను చూసి మురిసిపోవడం చిన్నప్పటి నుంచీ కూడా మనకు అలవాటే. కానీ మన కంటికి ఎంతో ప్రశాంతంగా, మన మనసుకు హాయినిచ్చేలా కనిపించే ఆ జాబిల్లి లోపల ఇప్పుడు షాకింగ్ నిజం నడుస్తోంది. నమ్మడానికి కొంచెం వింతగా ఉన్నా.. చందమామ రోజురోజుకీ సైలెంట్‌గా చిక్కిపోతున్నాడనేది పచ్చి నిజం వెలుగులోకి వచ్చింది.

మనిషి వయసు పెరిగే కొద్దీ మనుషుల చర్మంపై ముడతలు పడినట్లే, చంద్రుడి బాహ్య కవచంపై కూడా వేలాదిగా పగుళ్లతో పాటు కొండచరియల వంటి వింత నిర్మాణాలు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో చంద్రుడిపై నివాసాలు ఏర్పరుచుకోవాలని కలలు కంటున్న నాసాతో పాటు స్పేస్ ఏజెన్సీలకు ఈ కొత్త భౌగోళిక ప్రకంపనలు నిద్రలేకుండా చేస్తున్నాయి.

అసలు జాబిలి ఎందుకు కుచించుకుపోతుందనే విషయంలో అసలు సీక్రెట్ ఏంటంటే.. చంద్రుడి అంతర్భాగం మెల్లగా తన వేడిని కోల్పోతూ చల్లబడిపోతోంది. ఇలా వేడి తగ్గిపోవడం వల్ల లోపలి భాగం సంకోచిస్తూ ఉండటంతో, పైన ఉండే గట్టి క్రస్ట్ భాగంపై విపరీతమైన ప్రెజర్ పెరుగుతోంది.

పెళుసుగా మారిన ఆ ఉపరితలం ఈ ప్రెజర్ తట్టుకోలేక పగుళ్లు బారిన పడుతోంది. ఒక్కో పొర మరో పొరపైకి ఎక్కుతూ భయంకరమైన మూన్(Moon) క్వేక్స్ అంటే భూకంపాల లాగే చంద్రకంపాలకు కారణమవుతోంది. ఇలా ఈ 40 – 80 కోట్ల సంవత్సరాల కాలంలో చంద్రుని వ్యాసార్థం దాదాపు 45 మీటర్లు అంటే 148 అడుగులు వరకూ తగ్గిపోయిందని సైంటిస్టులు ఒక పక్కా లెక్కను తేల్చారు.

ఈ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ విషయాలు తాజాగా.. ది ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఒక ల్యాండ్‌మార్క్ స్టడీ ద్వారా బయటకు వచ్చాయి. స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం ఫేమస్ సైంటిస్ట్ థామస్ ఆర్.వాటర్స్ టీమ్ ఈ రీసెర్చ్‌కు నేతృత్వం వహించింది.

నాసా పంపిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటార్ కెమెరా (LROC) 17 ఏళ్లగా స్పేస్ నుంచి సేకరించిన అత్యంత కచ్చితత్వంతో కూడిన హై-రిజల్యూషన్ ఫోటోలను విశ్లేషించి, ఏకంగా 10,000కు పైగా పగుళ్లను గుర్తించారు. వీటిలో ఎక్కువ భాగం లోబేట్ స్కార్ప్‌లు అనే కర్వ్ షేప్‌లో కొండచరియలు, మేర్ రిడ్జ్‌లు అనే ముడతలు వంటి రూపంలో రూపాంతరం చెందినట్లు తేల్చారు.

ఇప్పుడు అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే.. ప్రపంచ దేశాలన్నీ కూడా మెయిన్‌గా నాసా తన ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ ప్రాజెక్ట్ కోసం చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole) పైనే కన్ను వేశాయి. అక్కడ ఉన్న పెద్ద పెద్ద బిలాల్లో ఐస్ రూపంలో నీటి నిక్షేపాలు ఉండే అవకాశం ఉండటంతో, మానవ ఆవాసాలకు అది పర్ఫెక్ట్ స్పాట్ అని అంతా భావించారు.

అయితే ఐరనీ విషయం ఏంటంటే.. ఇప్పుడు గుర్తించిన ఈ డేంజరస్ పగుళ్లు, చంద్రకంపాల ఎఫెక్ట్ ఎక్కువగా సౌత్ పోల్ వద్దే కేంద్రీకృతమై ఉందట. ఈ వైబ్రేషన్స్ వల్ల ఆస్ట్రోనాట్స్‌కు, అక్కడికి తీసుకెళ్లే మిషన్ గేర్లకు, అలాగే ఆ ప్రాంతంలో నిర్మించబోయే హాబిటాట్లకు ఊహించని ప్రమాదం పొంచి ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి చందమామలో సైలెంట్‌గా జరుగుతున్న ఈ జియోలాజికల్ గేమ్ వల్ల.. ఫ్యూచర్ మూన్(Moon) మిషన్లు ఒక కొత్త రేసులోకి నెట్టినట్లు అయింది. ఇకపై కేవలం జాబిలిపై కాలు మోపడమే కాదు, అక్కడ సంభవించే కంపనాలను తట్టుకునేలా చాలా సేఫ్‌గా ప్రయోగాలను డిజైన్ చేసుకోవడమే ఇప్పుడు సైంటిస్టులకు బిగ్గెస్ట్ ఛాలెంజ్‌గా మారబోతోంది. స్పేస్ రేస్‌లో ఎవరైనా ముందుండాలి అంటే ముందు ఈ మూన్ క్వేక్స్ మిస్టరీని తేల్చక తప్పదు.

With AI Chatting : ఏఐ చాటింగ్‌తో మైండ్ రిలాక్స్ అవుతుందా?..మీ మెంటల్ హెల్త్ రిస్క్‌లో పడినట్లే..

↑
Exit mobile version