NATO
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో కూటమి మధ్య సంబంధాలు ఈ మధ్య కాలంలో తీవ్ర ఉద్రిక్తతకు, సంక్షోభానికి దారితీశాయి. ఇరాన్ యుద్ధం విషయంలో నాటో దేశాలు అమెరికా సైనిక చర్యలకు మద్దతు ఇవ్వకపోవడం మరియు తమ స్థావరాలను ఉపయోగించుకోవడానికి నిరాకరించడంతో ట్రంప్ ఈ కూటమిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
నాటో(NATO)కూటమిలో ఉన్న 32 దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో కనీసం రెండు శాతం రక్షణ రంగానికి కేటాయించాలన్న నిబంధనను పాటించడం లేదని, దీనివల్ల అమెరికాపై అనవసరమైన ఆర్థిక భారం పడుతోందని ఆయన వాదిస్తున్నారు.ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం, హర్మూజ్ జలసంధి వివాదం వంటి సందర్భాల్లో నాటో(NATO )దేశాలు తమకు మద్దతు ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరప్ దేశాలు తమ రక్షణ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకోవాలని, అమెరికా రక్షణ సేవలను ఉచితంగా పొందే పద్ధతి ఇక చెల్లదని ఆయన పదేపదే స్పష్టం చేశారు.నాటో కూటమి నుంచి తప్పుకోవడాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన హెచ్చరించారు.
దీంతో నాటో(NATO )కూటమి నుంచి అమెరికా వైదొలుగుతుందనే భయం వెంటాడుతోంది. ట్రంప్‌తో సత్సంబంధాలు కొనసాగించడానికి నాటో కూటమి దేశాలు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నాయి. వీలైనంత త్వరగా విభేదాలను పరిష్కరించుకునే దిశగా నాటో అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ ఇప్పటికే ట్రంప్‌తో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు.నాటో కూటమి అమెరికాకు ఎలా ప్రయోజనకరంగా ఉందో వివరించి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.అమెరికాపై భారాన్ని తగ్గించేందుకు నాటో సభ్య దేశాలు తమ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుతున్నాయి.
ఉక్రెయిన్ సంక్షోభం మరియు ఇరాన్ వివాదాల కారణంగా అమెరికా, యూరప్ మధ్య నమ్మకాన్ని పెంచడానికి నాటకీయ చర్యలకు బదులుగా, సైనిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునే వ్యూహంపై దృష్టి పెట్టాయి.కేవలం రక్షణకే పరిమితం కాకుండా, వ్యూహాత్మక జలసంధుల రక్షణ మరియు సైబర్ రక్షణలో అమెరికాకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.
