Russia – India Rail Route
ఎప్పడు యుద్ధాలు జరిగినా మొదట ఏర్పడేది చమురు సంక్షోభమే. ఉక్రెయిన్,రష్యా యుద్ధమైనా, పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా యుద్ధమైనా చివరికి చమురు రవాణాపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. దీంతో భారత్, చైనా వంటి కొన్ని దేశాల్లో చమురు సంక్షోభం తలెత్తుతోంది.
అయితే ఇదే సమయంలో భారత్‌కు చమురు రవాణా చేస్తున్న రష్యాపైన ఆంక్షలు విధించడం కూడా ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఈ చమురు రవాణా హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. కానీ అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో విదేశీ నౌకలపై సైతం దాడులు జరుగుతున్నాయి.
పనిలో పనిగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్‌పై అమెరికా ఆంక్షలు పెట్టింది. భారత్ మాత్రం అమెరికా మాటను ఖాతరు చేయలేదు. అయితే హర్మూజ్ జలసంధితో ఎదురవుతున్న రవాణా ఇబ్బందులకు చెక్ పెట్టడానికి రష్యా సంచలన ప్రతిపాదన చేసింది. మాస్కో నుంచి డైరెక్టుగా భారత్‌కు రైలు మార్గం ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. రష్యా ప్లాన్ ప్రకారం ఈ రైలు మార్గం తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ గుండా వెళ్లే అవకాశముంది.
అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుధ్ధంతో హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా సాధ్యం కావడం లేదు. ఇరాన్ ఆ మార్గాన్ని మూసేసి అమెరికాతో సహా కొన్ని దేశాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. మధ్యలో కొన్ని రోజులు తెరిచినా పూర్తిస్థాయిలో అది అమలు కాకపోవడం ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
దీంతో ఈ ఇబ్బందులకు పరిష్కారంగానే రష్యా భారత్‌కు డైరెక్టుగా రైలు మార్గం ప్రతిపాదన తీసుకొచ్చింది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం మీదుగా భారతదేశానికి సురక్షితంగానే కాకుండా వేగంగా సరుకు రవాణా మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రష్యా భావిస్తోంది.
రష్యా ఉప ప్రధాని మరాత్ ఖుస్నుల్లిన్ ఈ ప్రతిపాదన వెల్లడించారు. దీనికి ఇంకా ఎలాంటి రూట్ మ్యాప్ ఖరారు కాలేదు. కానీ కీలక ప్రతిపాదన కావడంతో రెండు దేశాలు చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుతో భారత్‌తో తమ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని రష్యా భావిస్తోంది.
నిజానికి అమెరికా ఆంక్షలు విధించినా కూడా మొదటి నుంచీ రష్యాకు భారత్ మిత్ర దేశంగానే ఉంటోంది. అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఎప్పటికప్పుడు భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికే మొగ్గు చూపిస్తున్నారు.
కాకపోతే ఈ రైలు మార్గం ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్, నిర్మాణ వ్యయం, రెండు దేశాల మధ్య ఒప్పందాలు, భద్రతా అంశాలు వంటి చాలా క్లిష్టమైన దశలు కీలకం కానున్నాయి.
