Trump
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం తప్పదన్న వార్తలు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. కాల్పుల విరమణ, వరుస చర్చలు, హార్మూజ్ జలసంధి తెరుచుకోవడం వంటి పరిణామాలతో యుద్ధం ముగిసినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ఫలించాయన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.
తాజాగా ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించడంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్(Trump) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత రెండు రోజులుగా సీజ్ ఫైర్ పై ప్రకటన వెలువడుతుందని అంతా ఎదురుచూసారు. వైట్ హౌస్ వేదికగా జరిగిన కీలక సమావేశంలో ప్రధానంగా దీనిపైనే చర్చించినట్టు కూడా అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
అయితే సీజ్ ఫైర్ పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసినట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అణ్వాయుధాలు తయారుచేయబోమని ఇరాన్ హామీ ఇచ్చినట్టు వార్తలు రావడంతో కాల్పుల విరమణ మరో 60 రోజులు పొడిగిస్తారని ప్రచారం జరిగింది.
అదే సమయంలో శాంతి చర్చలు మరోస్థాయికి చేరాయని, యుద్ధానికి ముగింపు పలికినట్టు ఇరు దేశాల నుంచి ఏ క్షణమైనా ప్రకటనలు రావొచ్చన్న వార్తలు కూడా రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని ఇరాన్ వెల్లడించడంతో ఆ ప్రచారానికి తెరపడినట్టయింది.
అలాగే కాల్పుల విరమణ పొడిగింపుపై అమెరికాతో ఇంకా ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి చెప్పారు. ఇరుపక్షాల మధ్య ప్రస్తుతం సమాచార మార్పిడి కొనసాగుతోందని వెల్లడించారు.తమ ప్రస్తుత లక్ష్యం యుద్ధాన్ని ముగించడమేనని చెప్పిన ఆయన అమెరికా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదన్నారు.
చర్చలు పూర్తిస్థాయిలో జరగకుండా ఇరాన్ యురేనియం డీల్ కు సంబంధించి తాము మాట్లాడలేమని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ వాదనకు భిన్నంగా అమెరికా వ్యాఖ్యలు ఉన్నాయి. కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ఒప్పందం ఖరారైనట్టు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు.
దీనిపై ట్రంప్(Trump) తుది నిర్ణయం తీసుకుని ప్రకటన చేయడమే మిగిలిందంటూ మాట్లాడారు. కానీ అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో ఇరాన్ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. అణ్వాయుధ దేశంగా మారబోమన్న కీలక షరతుకు ఇరాన్ అంగీకరించాలని డిమాండ్ చేశారు.
Notes :మరో డెసిషన్ తీసుకుంటున్న ఆర్బీఐ ..ఇక ఆ 3 నోట్లు కనిపించవా?
