Kota Srinivasa Rao:కోట శ్రీనివాసరావు ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు ఈ విషాద వార్త వినగానే ప్రతి ఒక్కరు తమ జ్ఞాపకాలలో ఒక పాతికేళ్లు వెనక్కి నడిచి వెళ్తారు
Kota Srinivasa Rao
కోట శ్రీనివాసరావు ఏ స్థాయి నటుడు(Actor) అని చెప్పడానికి తెలుగు వాళ్ల దగ్గర మీటర్ లేదు.. ఇంకా చెప్పాలంటే అతని నటనా స్థాయిని గుర్తించగలిగే స్థాయి వ్యక్తులు ఇక్కడ లేరు అని చెప్పటం సబబేమో..
ఇంకొంచెం గట్టిగా చెప్పాలి అంటే కోట శ్రీనివాస్(kota Srinivasa Rao)లో నటుడిని రాబట్టడంలో, తెరమీద పెట్టడంలో తెలుగు సినిమా పరిశ్రమ కొంత వరకు విఫలం అయ్యిందనే చెప్పాలి.. ఎందుకంటే అంతటి మల్టీ డైమెన్షన్ ట్యాలెంట్ కోట సొంతం ప్రపంచ స్థాయి నటుడు ఆయన !
ఇరవై ఏళ్లు వెనక్కి వెళితే మాత్రం మన జీవితాల్లో ఏ దుర్మార్గమైన మనిషి ఎదుట పడినా వీడు కోటాలా ఉన్నాడు అనే పరిస్థితి. నవ్వించే మనిషి కంటబడితే కోట శ్రీనివాసరావు ఒక్కడే గుర్తొచ్చే పరిస్థితి..
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎస్వీ రంగారావు తర్వాత అంతటి స్థాయి నటుడు కోటా అంటే కొంత మందికి రుచించదేమో కానీ నూటికి నూరుపాళ్లు ఇది నిజం..
కోటాను వాడుకోవడంలో తెలుగు సినీ పరిశ్రమ విఫలమైంది.. అవును ఆస్కార్ స్థాయి నటుడు చేత పొడి పొడి వేషాలు వేయించిన మన పరిశ్రమకు పక్క రాష్ట్రం నుంచి దర్శకులు వచ్చి చెప్పే వరకు కోట నటన మీద అంచనాకు రాని సందర్భాలు వెండితెర సాక్షిగా ఎన్నో ఉన్నాయి !
ఇంకా చెప్పాలి అంటే కోటను పక్కకు పెట్టి ప్రకాష్ రాజ్, షియాజి షిండే, ముఖేష్ రిషి, లాంటి తెలుగు రాని, తెలుగు కాని నటులకు అవకాశాలు ఇచ్చి కోట కంట కన్నీళ్లకు కూడా మనమే కారణం అయ్యాము…
కనీసం ఒక వంద మంచి సినిమా పాత్రలలో కోట శ్రీనివాసరావు తన నటనా శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని తెలుగు పరిశ్రమ యొక్క మరుగుజ్జు నిర్ణయాల వలన కోల్పోయాము అంటే ఎవరైనా నమ్మకుండా ఉండగలరా?
చనిపోయాక మైకులు ముందు కోటాను మించిన నటనతో ఏడ్చి గగ్గోలు పెట్టే నటులు, దర్శకులు కోట కోసం ఎన్ని గొప్ప పాత్రలు రాసుకుని సినిమాలు తీశారు ? గొప్ప పాత్రల్లో కోట శ్రీనివాసరావు నటించాల్సిన అవసరాన్ని గతంలో ఏనాడైనా గుర్తించారా? లేదు కదా.. క్యారక్టర్ ఆర్టిస్టు అంటే ఫ్రేమ్‌లో నిలబడితే చాలు అనుకునే తెలుగు పోలియో పీడిత తెలుగు కథలకు కోట ఎలా సరిపోతాడు? ఎందుకు సరిపోతాడు ?
“ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే” అనే సినిమాలో సెల్వ రాఘవన్ అనే దర్శకుడు వచ్చి చెప్పే వరకూ మనకు కోటాలో గొప్ప తండ్రి కనబడలేదు. తిరుపతి స్వామి వచ్చి “గణేష్” సినిమా తీసేవరకు మనకు ఆయనలో మంచి విలన్ కనబడలేదు. రామ్ గోపాల్ వర్మ “సర్కార్” తో కరుణించే వరకు కోటా ఒక పాన్ ఇండియా నటుడు అని మనకు తెలియని నిస్సహాయ పరిస్థితి. వాళ్లే లేకపోతే ఇంకా మనం సృజనాత్మకత అనుకునే గాఢాంధకారంలో మగ్గుతూ ఉండేవాళ్లం. కాదు ఇప్పుడు మగ్గుతూనే ఉన్నాం !
కోట నటన సప్త సముద్రాలు దాటి ఆస్కార్‌ను అందుకోగలిగేది అన్న వాస్తవ దృష్టి మన దర్శకులలో లోపించింది. తమిళ , మలయాళ రంగాలలో ఉన్న గొప్ప దర్శకులు, కళా ఖండాలు తీసేవారు మనకు లేక పోవడం కూడా కోట చేసుకున్న దురదృష్టం. ఇంకొంచెం ముందుకు వెళ్లి మాట్లాడితే తెలుగు వాడిగా పుట్టడమే కోట చేసుకున్న దురదృష్టం. అది ఒక చేదు నిజం.. కమర్షియల్ వెకిలి డబుల్ మీనింగ్ సినిమాలను ప్రేమించి, శ్వాసించే సినీ రంగాన కళ కేవలం మాటలకే పరిమితం అయిన చోట కోట లాంటి ప్రపంచ స్థాయి ప్రొఫెషనల్ నటులు పుట్టకూడదు.
ఏ హాలీవుడ్‌లోనో మరీ కాకపోతే తమిళ, మలయాళ , బెంగాళీ భాషల్లో కోట పుట్టి ఉంటే ఒక నటనా ఎవరెస్టును మనం గొప్ప గొప్ప వేదికల మీద చూడగలిగే వాళ్లం ఏమో..
ఒక నటుడి మరణం కేవలం ఆ ఒక్క వ్యక్తి మరణం గా మాత్రమే చూడకూడదు. అది కొన్ని వందల , వేల గొప్ప పాత్రల మరణంలా మనం భావించాల్సి ఉంటుంది. అది అర్థం అయినప్పుడే ఆ వ్యక్తి మరణం వలన ఏర్పడ్డ సృజనాత్మక శూన్యత యొక్క శక్తి మనకు అర్ధం అవుతుంది..!
వాస్తవానికి కోట శ్రీనివాసరావు ఈరోజు మరణించలేదు. పరాయి భాషా నటుల మొహంలో మనమే కోటాలో నటుడిని పాతికేళ్లుగా క్రమక్రమంగా ఒక పద్ధతి ప్రకారం హత్య చేసుకుంటూ వచ్చాం. మళ్లీ యథాలాపంగా ఈ రోజు మొసలి కన్నీళ్లు పెడుతున్నాం..మన నటనకు ఆస్కార్ కూడా చాలా తక్కువ.. కానీ కోట లాంటి నటులు మళ్లీ పుట్టడానికి మాత్రం ఆస్కారం లేదు.. ఇదొక్కటే గ్రహించండి.
– క్రాంతి