Gaddar Awards
తెలంగాణ చిత్ర పరిశ్రమలో ప్రతిభను గుర్తించి గౌరవించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ నిర్వహణకు అధికారికంగా శ్రీకారం చుట్టింది. ప్రజా యుద్ధనౌక గద్దర్ జ్ఞాపకార్థం.. ఈ అవార్డులను ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వీటికి సంబంధించిన విధివిధానాలను విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేషన్ పొందిన సినిమాన్నీ ఈ అవార్డుల పోటీకి అర్హమైనవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అవార్డుల ద్వారా తెలంగాణ సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా, సామాజిక స్పృహ కలిగిన సినిమాలకు పెద్దపీట వేయాలనేదే ప్రభుత్వ సంకల్పం.
ఈ ఏడాది గద్దర్ అవార్డు(Gaddar Awards)ల్లో కొన్ని ప్రత్యేక విభాగాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గతంలో ఉన్న విభాగాలతో పాటు, సమాజంలోని సమస్యలను కూడా ఎత్తిచూపుతూ సామాజిక మార్పు కోసం నిర్మించిన సినిమాలకు ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అనే సరికొత్త అవార్డును ప్రవేశపెట్టారు. అలాగే, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారిని గౌరవిస్తూ డాక్టర్ సి.నారాయణరెడ్డి అవార్డును కూడా ఈ వేడుకలో అందజేయనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కళాకారులకు , సినీ ఇండస్ట్రీకి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, సినిమా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, విలువలతో కూడిన సినిమాలను ప్రోత్సహించడమే ఈ అవార్డుల పరమార్థమన్నారు.
అలాగే అవార్డుల దరఖాస్తు ప్రక్రియపై కూడా ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అర్హులైన నిర్మాతలు , సాంకేతిక నిపుణులు తమ దరఖాస్తు పత్రాలను, పూర్తి మార్గదర్శకాలను జనవరి 31, 2026 వరకు పొందే అవకాశముంది. అప్లికేషన్లను సమర్పించడానికి ఫిబ్రవరి 3, 2026 వరకు గడువు నిర్ణయించారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులు, నిర్మాతలు నిర్ణీత గడువులోగా తమ ఎంట్రీలను సమర్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సినీ రంగంలో ప్రతిభను ప్రోత్సహించడానికి ఇంత పెద్ద ఎత్తున అవార్డులు ప్రకటించడం ఇదే మొదటిసారి. ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Zero waste kitchen:జీరో వేస్ట్ కిచెన్..ఆరోగ్యం, ఆదాయం పెంచే ఈ అలవాట్లు చేసుకోండి..
