Krishnam Raju
సినిమా రంగంలో రెబల్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన దివంగత నటుడు కృష్ణంరాజు(Krishnam Raju), నిజ జీవితంలో కూడా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు మాత్రం ‘యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్’ (UKIDFF) రూపంలో నిత్యం జీవిస్తూనే ఉన్నాయి.
సమాజానికి ఉపయోగపడే సేవ చేయడమే నిజమైన నివాళి అని నమ్మిన ఆయన కుటుంబ సభ్యులు, యూకే , ఇండియాలోని ప్రముఖ వైద్య నిపుణులతో కలిసి ఈ అద్భుతమైన సేవా యజ్ఞాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ వల్ల వచ్చే పాదాల సమస్యలతో బాధపడే పేద ప్రజలకు ఈ సంస్థ ఒక ఆశాకిరణంగా మారింది.
డయాబెటిస్ ఉన్నవారికి పాదాల సమస్య అనేది ఒక నిశ్శబ్ద శత్రువు లాంటిది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల పాదాల్లో నరాలు దెబ్బతిని స్పర్శ కోల్పోతారు. దీనివల్ల చిన్న గాయమయినా తెలీదు. అది కాస్తా పెద్ద ఇన్ఫెక్షన్‌గా మారి చివరకు కాలు తీసేయాల్సిన (Amputation) పరిస్థితి వస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి కొన్ని నిమిషాలకు ఒకరు డయాబెటిక్ ఫుట్ వల్ల తమ అవయవాన్ని కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే లక్ష్యంతో యూకేలోని నిపుణులైన డాక్టర్లు, ఇండియాలోని డాక్టర్లు కలిసి UKIDFF సంస్థను స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అత్యాధునిక వైద్యం అందించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం.
కృష్ణంరాజు (Krishnam Raju) స్ఫూర్తితో ఉచిత వైద్య శిబిరాలు..కృష్ణంరాజు (Krishnam Raju)కి గ్రామీణ ప్రజలన్నా, పేదలన్నా ఎంతో ప్రాణం. వారికి నాణ్యమైన వైద్యం అందాలన్నదే ఆయన జీవితకాల స్వప్నం. అందుకే కృష్ణంరాజు జయంతి , వర్ధంతి సందర్భాలలో ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ఈ శిబిరాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో పాదాల నరాల పరీక్షలు (Vibration perception test), రక్త ప్రసరణ పరీక్షలు నిర్వహిస్తారు. యూకే నుంచి వచ్చిన నిపుణులు స్వయంగా రోగులను పరీక్షించి, అవసరమైన వారికి ఫ్రీగా మందులు , ప్రత్యేకమైన చెప్పుల గురించి అవగాహన కల్పిస్తారు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల 80 శాతం వరకు అవయవాలు కోల్పోయే ప్రమాదాన్ని నివారించొచ్చని ఈ సంస్థ నిరూపిస్తోంది.
చాలా మంది రైతులు, కూలీలు డయాబెటిస్ ఉన్నా పనుల కోసం తప్పనిసరిగా పొలాల్లో తిరుగుతుంటారు. కాళ్లకు చిన్న గాయాలైనా నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ముదిరిపోయి చివరకు ప్రాణాల మీదకు వస్తుంటాయి.
ఖరీదైన ట్రీట్మెంట్‌లు చేయించుకోలేని అలాంటి పేద కుటుంబాలకు UKIDFF ఉచిత శిబిరాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. కాళ్లు క్షేమంగా ఉంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుందని గుర్తించిన కృష్ణంరాజు కుటుంబ సభ్యులు, ప్రతి ఏటా ఈ శిబిరాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఇది కేవలం ఒక వైద్య సేవ మాత్రమే కాదు, వేల కుటుంబాల్లో వెలుగులు నింపే గొప్ప మానవతా కార్యక్రమంగా నడుస్తోంది.
డయాబెటిక్ ఫుట్ సమస్యలపై అవేర్నెస్ కల్పించడమే తమ అంతిమ లక్ష్యమని ఈ ఫౌండేషన్ పేర్కొంటోంది. పేషెంట్లకు తమ పాదాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి.. రోజూ ఎలా పరీక్షించుకోవాలనే విషయాలపై ట్రైనింగ్ ఇస్తారు. మొత్తంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరగాలని, డయాబెటిస్ వల్ల.. ఎవరూ తమ అవయవాలను కోల్పోకూడదని ఆశిద్దాం.
Ambulance:పశువులకు ఊరూరా అంబులెన్స్‌లు, ఇన్సూరెన్స్‌లు ..ఇది రైతులకు నిజంగా గుడ్ న్యూసే
