Mumbai Indians
ఐపీఎల్ ఎప్పుడు వచ్చినా టైటిల్ ఫేవరెట్ రేసులో ఖచ్చితంగా వినిపించే పేరు ముంబై ఇండియన్స్(Mumbai Indians)… ఆరంభంలో తడబడినా.. మధ్యలో చతికిలపడినా చివరికి వచ్చేసరికి మాత్రం అద్భుతమైన ఆటతీరుతో ట్రోఫీ ఎగరేసుకుపోవడం ముంబైకే చెల్లింది. అందుకే ప్రతీ సీజన్ లోనూ టైటిల్ రేసులో ముందుంటుంది. అయితే చివరిసారిగా 2020లో ట్రోఫీ గెలిచిన ముంబై ఆ తర్వాత వరుసగా చతికిలపడుతూ వస్తోంది.
2024 సీజన్ లో అయితే మరీ దారుణంగా చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. గత సీజన్ లో మాత్రం ప్లే ఆఫ్స్ కు చేరగలిగింది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ టైటిల్ గెలవాలనే పట్టుదలతో మినీ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే అతితక్కువ మొత్తం రూ.2.75 కోట్లతోనే బరిలోకి దిగిన ముంబై తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తమ మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్‌ను అతని కనీస ధర కోటి రూపాయలకే దక్కించుకుంది.
ప్రధాన ఆటగాళ్లందర్నీ వేలానికి ముంబై రిటైన్ చేసుకోవడంతో పాటు ట్రేడింగ్ ద్వారా కీలక ఆటగాళ్లను జట్టులోకి తెచ్చుకుంది. శార్దూల్ ఠాకూర్, రూథర్ ఫోర్డ్, మయాంక్ మార్కండేలను ట్రేడ్ చేసుకుంది. ఈ కారణంగానే మినీ వేలంలో ముంబై ఇండియన్స్‌కు పెద్దగా పనిలేకుండా పోయింది. తక్కువ మొత్తంతోనే వేలానికి వెళ్లి బ్యాకప్ ఓపెనర్‌తో పాటు వికెట్ కీపర్ స్థానాన్ని డికాక్‌తో భర్తీ చేసుకుంది.
ముంబై(Mumbai Indians) బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు గుండెల్లో దడే. ఎందుకంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నుంచి చివర్లో ఆల్ రౌండర్ కమ్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా వరకూ అందరూ టీ ట్వంటీ స్పెషలిస్టులే. రోహిత్ , డికాక్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా పవర్ ప్లేలో వీరిని కాచుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు అతిపెద్ద సవాల్.
అలాగే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి హిట్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. వీరితో పాటు రూథర్ ఫర్డ్ , రికెల్టన్ కూడా రెచ్చిపోతే భారీస్కోర్లు ఖాయం. ఇక ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పే కెప్టెన్ హార్థిక్ పాండ్యా అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ సత్తా చాటుతున్నాడు.. ఇక బౌలింగ్ లో ముంబై ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా.
ఈ స్టార్ పేసర్ ముంబై విజయాల్లో కీలకంగా ఉంటాడు. అతనితో పాటు ట్రెంట్ బౌల్ట్ , దీపక్ చాహర్ , శార్థూల్ ఠాకూర్ లతో పేస్ ఎటాక్ మరింత బలపడింది. స్పిన్ విభాగంలో మిఛెల్ శాంట్నర్ తో పాటు స్వదేశీ స్పిన్నర్ మయాంక్ మార్కండే లాంటి యువ ఆటగాడు ఉండడం కూడా అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.
అయితే ఈ సీజన్ లో తుది జట్టు ఎంపిక ముంబై టీమ్ మేనేజ్ మెంట్ గా పెద్ద సవాల్ గా భావిస్తున్నారు. ఆరంభంలో తడబాటు ఆ జట్టును గత కొన్ని సీజన్లుగా వెంటాడుతూ వస్తోంది. దీనిని అధిగమిస్తే హార్థిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తొలి టైటిల్, మొత్తంగా ఆరో ట్రోఫీ సాధించడం పెద్ద కష్టం కాదు.
