Gandikota
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ లోయల గురించి మనలో చాలామంది వినే ఉంటారు. కానీ అంతటి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోనే ఉందన్న విషయం కొద్దిమందికే తెలుసు. పెన్నా నది ఎర్రటి గ్రానైట్ శిలల మధ్య నుంచి దారి చేసుకుంటూ వెళ్తుంటే.. ఏర్పడిన గండికోట(Gandikota) లోయలు పర్యాటకులకు స్వర్గంలా కనిపిస్తాయి.
వేల సంవత్సరాల క్రితం నది ప్రవాహం వల్ల కొండలు కోయడంతో.. ఏర్పడిన ఈ సహజ సిద్ధమైన లోయ దృశ్యం కళ్లకు విందు చేస్తుంది. ఈ కోట 13వ శతాబ్దానికి చెందిందని చరిత్ర చెబుతుంది. పెమ్మసాని కమ్మ రాజులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారట. ఇక్కడ జమా మసీదు, రంగనాథ స్వామి ఆలయం ఒకే చోట ఉండటం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
గండికోట(Gandikota)లో సాహస యాత్రికులకు, ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. నది ఒడ్డున ఉన్న కొండల పైన టెంట్లు వేసుకుని రాత్రిపూట క్యాంపింగ్ చేయడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. సూర్యోదయ , సూర్యాస్తమయ సమయాల్లో ఆ రాతి లోయల మీద పడే వెలుగులు ఫోటోగ్రాఫర్లకు అద్భుతమైన ఫ్రేములను ఇస్తాయి.
కోట లోపల ఉన్న ధాన్యపు గారెల కొట్టు,పెద్ద చెరువు, పురాతన కట్టడాలు మన చరిత్రను గుర్తు చేస్తాయి. నగర రణగొణధ్వనులకు దూరంగా, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి గండికోట ఒక బెస్ట్ వీకెండ్ స్పాట్ అండ్ విజిట్ ప్లేస్. శీతాకాలం ఇక్కడికి వెళ్లడానికి సరైన సమయం. ఏపీ టూరిజం వారు ఇక్కడకు వెళ్లేవారికి హోటల్, ట్రాన్స్‌పోర్ట్ వసతులు కూడా కల్పించారు.
