Ayyappa Swamy
అయ్యప్ప స్వామి భక్తులకు శబరిమల ఆలయ అధికారులు తీపి కబురును అందించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు ఈడీ ప్రసాద్ ..మీన మాస పూజల కోసం గర్భగుడి తలుపులు తెరిచి, దీపాన్ని వెలిగించి పూజలు ప్రారంభించారు. అనంతరం ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అయ్యప్ప భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిని ఇస్తున్నారు.
శబరిమల అయ్యప్ప స్వామి(Ayyappa Swamy )కి ఈ మాస పూజల సందర్భంగా ఆలయంలో కలభాభిషేకం, పడి పూజలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మీన మాస పూజలు పూర్తయ్యాక, మళ్లీ మార్చి 19వ తేదీ రాత్రి 10 గంటలకు ఈ ఆలయ తలుపులను మూసివేస్తారు.
అయితే,అయ్యప్ప భక్తులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. శబరిమల వార్షిక ఉత్సవాల కోసం మార్చి 22న సాయంత్రం 5 గంటలకు మళ్లీ ఆలయాన్ని తెరుస్తారు. మార్చి 23వ తేదీన జరిగే కొడియేట్టలు అంటే ధ్వజారోహణంతో ఈ వార్షిక ఉత్సవాలు అధికారికంగా మొదలవుతాయని అధికారులు వివరించారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి 31న పల్లివెట్ట కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న పంబా నది వద్ద జరిగే ఆరట్టు మహోత్సవంతో ఈ వార్షిక వేడుకలు ముగుస్తాయి. అదే రోజు రాత్రి 10 గంటలకు స్వామివారి సన్నిధానం తలుపులను మూసేస్తారు.
ఈ ఉత్సవాల సమయంలో ఆలయంలో ప్రతిరోజూ శ్రీభూతబలి, ఉత్సవబలి వంటి విశేష పూజలు జరుగుతాయి. స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలనుకుంటే .. నెయ్యాభిషేకం, అష్టాభిషేకం, పుష్పాభిషేకం, కలభాభిషేకం వంటి సేవల్లో భక్తులు పాల్గొనవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన, అథాజపూజ నిర్వహించాక స్వామివారిని సాంప్రదాయ వాద్యాల మధ్య శ్రీబలి ఊరేగింపుగా తీసుకుని వెళతారు. మొత్తంగా అయ్యప్ప స్వామి (Ayyappa Swamy )దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ..ఈ తేదీలను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.
