Annadata Sukhibhava
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం (ఆగస్టు 2) నాడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్రంలోని రైతులకు ఒక పండుగలాంటి వార్త. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో మొదటి విడత నిధులు జమ కానున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక్కో రైతుకు ₹5,000 చొప్పున మొత్తం ₹2,342.92 కోట్లు విడుదలయ్యాయి.
ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ₹5,000తో పాటు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ పథకం కింద ₹2,000 కలిపి, మొత్తం ₹7,000 ఒక్కో రైతుకు నేరుగా అందుతాయి. దీంతో రైతన్నలకు ఈ సీజన్‌లో పెట్టుబడి భారం తగ్గుతుంది.
రైతులకు కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా, వారి సమస్యలను కూడా పరిష్కరించేలా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. సాగునీటి ఎద్దడి, ఎరువుల కొరత లేకుండా చూడాలని, రైతులకు సహాయం చేయడం ప్రభుత్వానికి భారం కాదని, అది ఒక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రైతుల ఖాతాలు క్రియాశీలంగా ఉండేలా అవగాహన కల్పించాలని, ఇందుకోసం ‘మనమిత్ర’ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి 155251 టోల్-ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) పథకం ద్వారా రైతులకు ఏడాదికి మొత్తం ₹20,000 పెట్టుబడి సాయం అందనుంది. ఇందులో కేంద్రం ఇచ్చే ₹6,000 (మూడు విడతలుగా ₹2,000 చొప్పున) , రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ₹14,000 (మూడు విడతలుగా ₹5,000, ₹5,000, ₹4,000) ఉంటాయి. ఈ విధంగా, మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ₹5,000 మరియు కేంద్రం ₹2,000 కలిపి, మొత్తం ₹7,000 రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో , రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతాల్లో ఈ పథకం నిధులను విడుదల చేయలేదు. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లు, కొన్ని పంచాయతీలు , మండలాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయొద్దని కమిషనర్ సూచించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో పీఎం కిసాన్ నిధులను విడుదల చేయవచ్చని తెలిపారు.
Also Read: Pawan : పాదరక్షల నుంచి రగ్గుల వరకు.. పవన్ ప్రేమ అజరామరం