Bhogapuram Airport
ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒక గేమ్ ఛేంజర్ గా మారబోతోంది. విజయనగరం జిల్లాలో దాదాపు 2200 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఎయిర్ పోర్ట్ కేవలం ప్రయాణాలకే కాకుండా, ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి ఒక ప్రధాన కేంద్రంగా నిలవనుంది. ఈరోజు ఈ విమానాశ్రయంలో తొలి ట్రయల్ రన్ విమానం విజయవంతంగా ల్యాండ్ అవడం ఒక కీలక మైలురాయి అని చెప్పొచ్చు.
దాదాపు 4600 కోట్ల రూపాయలతో జి.ఎం.ఆర్ (GMR) సంస్థ నిర్మిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలను కలిగి ఉంది.
ఈ విమానాశ్రయం ప్రత్యేకతలను పరిశీలిస్తే, ఇది విశాఖపట్నం సిటీ నుంచి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారికి సమీపంలో ఉండటం అతిపెద్ద సానుకూల అంశం అవుతుంది. ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్ పోర్టు నేవీ ఆధీనంలో ఉండటం వల్ల పౌర విమానయానానికి కొన్ని పరిమితులు ఉన్నాయి.
కానీ భోగాపురం పూర్తిస్థాయి సివిలియన్ ఎయిర్‌పోర్టు కావడంతో ఇక్కడ నుంచి ప్రపంచంలోని అన్ని ప్రముఖ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులు నడుస్తాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్ లేదా చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. అంతేకాకుండా ఇక్కడ నిర్మిస్తున్న భారీ రన్ వే వల్ల.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఏ380 (A380) వంటివి కూడా ఇక్కడ ఈజీగా ల్యాండ్ అయ్యే వీలుంది.
భోగాపురం విమానాశ్రయం( Bhogapuram Airport) కేవలం ప్రయాణికుల కోసమే కాదు, కార్గో రవాణాలో కూడా కీలక పాత్ర పోషించబోతోంది. ఉత్తరాంధ్రలో ఉన్న ఫార్మా హబ్, ఐటీ కంపెనీలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ఈ ఎయిర్ పోర్ట్ ఒక వరప్రసాదం కానుంది.
ఈ ఎయిర్‌పోర్ట్ లోపల సుమారు 5000 మంది కూర్చునే విధంగా విశాలమైన టెర్మినల్ బిల్డింగ్‌ను నిర్మించారు. దీని డిజైన్ లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.
ఎయిర్ పోర్ట్ పరిసరాలు పర్యావరణ హితంగా ఉండేందుకు సోలార్ పవర్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం విమానాశ్రయమే కాకుండా, విమానాల మరమ్మతుల కోసం ఎం.ఆర్.ఓ (MRO) సెంటర్ ను కూడా ఏర్పాటు చేయబోతుండటం నిజంగా మంచి విషయం . ఎందుకంటే ఇది కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానకి చర్యలు తీసుకుంటోంది. మరోవైపు విశాఖ నుంచి భోగాపురం వరకు నిర్మిస్తున్న సిక్స్ లేన్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే, కేవలం 30 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మెట్రో రైలు కనెక్టివిటీని తీసుకురావడానికి కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
భోగాపురం విమానాశ్రయం( Bhogapuram Airport) పూర్తిస్థాయిలో కనుకు అందుబాటులోకి వస్తే ఏపీకి రెండో రాజధానిగా భావించే విశాఖపట్నం ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుంది. పర్యాటక రంగం కూడా దీనివల్ల భారీగా పుంజుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల ఆశల విమానమై ఎగిరడానికి సిద్ధంగా ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
