Senimar
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ (IMD) నుంచి ఊరటనిచ్చే వార్త అందింది. బంగాళాఖాతంలో బలపడుతున్న తుపాను ముప్పు రాష్ట్రానికి పూర్తిగా తప్పినట్లు భారత వాతావరణ శాఖ ధృవీకరించింది. దీనితో తీర ప్రాంత ప్రజలు భారీ వర్షాలు, బలమైన గాలుల భయం నుంచి బయటపడినట్లు అయింది.
మలక్కా జలసంధి ప్రాంతంలో మొదటగా బలపడిన తీవ్ర వాయుగుండం (Deep Depression), పశ్చిమ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక తుపానుగా రూపాంతరం చెందింది. ఈ తుపానుకు ‘సెనియార్’ (Senyar) అని నామకరణం చేయడం జరిగింది.
ఈశాన్య ఇండోనేషియాకు ఆనుకుని ఉన్న మలక్కా జలసంధి సమీపంలో సెనియార్ తుపాను ఆవిర్భావ ప్రాంతంగా వాతావరణశాఖ అధికారులు గుర్తించారు. ఇది గత ఆరు గంటల వ్యవధిలో గంటకు సుమారు 10 కిలోమీటర్ల వేగంతో దాదాపు పశ్చిమ దిశగా కదిలిందని, ఈ క్రమంలోనే అది తీవ్ర అల్పపీడనం నుంచి తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అయితే, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ సెనియార్ తుపాను ఎక్కువ కాలం బలం పుంజుకోదు. రానున్న 24 గంటల తర్వాత ఇది క్రమంగా బలహీనపడటం ప్రారంభమవుతుంది. తుపాను తన ప్రయాణంలో బంగాళాఖాతంలోనే ఉండి, శక్తిని కోల్పోతుందని, బుధవారం మధ్యాహ్నం సమయానికి ఇండోనేషియా ప్రాంతాన్ని దాటే అవకాశాలు ఉన్నాయని IMD పేర్కొంది.
ఈ బలహీనత వల్ల, సెనియార్(Senimar) తుపాను భారత్ తీరానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దూరం పాటిస్తుంది. దీని పర్యవసానంగా, సెనియార్ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు లేదని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ తాజా పరిణామం రాష్ట్రంలోని రైతులకు, మత్స్యకారులకు ఎంతో మేలు చేస్తుంది.
