EHS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు (Government Employees) ఒక పెద్ద శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అయిన ఈహెచ్ఎస్ (Employee Health Scheme) ద్వారా వైద్య సేవలు పొందడంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, ఆ సేవలను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, ఈహెచ్ఎస్ (EHS)సమస్యల పరిష్కారం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఒక అత్యున్నత స్థాయి కమిటీని (High-Level Committee) నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉన్నత స్థాయి కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ విభాగాల నుంచి సాధారణ పరిపాలన శాఖ (GAD), ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయాలు..ఉద్యోగులకు గుడ్‌న్యూస్, రాజధాని నిర్మాణానికి కొత్త ఊపు!
ఉద్యోగుల సమస్యలను నేరుగా కమిటీ దృష్టికి తీసుకురావడానికి, ఉద్యోగ సంఘాల నుంచి ఏపీ ఎన్జీవో (APNGO) రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్, మరియు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఇక, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో ఈ కమిటీకి సభ్యుడు మరియు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఈ కమిటీ ఈహెచ్ఎస్(EHS) కార్డుల ద్వారా మెరుగ్గా వైద్య సేవలు అందించే అంశంపై లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశాలు అందాయి. ఈ అధ్యయన నివేదికను 8 వారాల్లోపు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలి. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది.
