Just PoliticalJust Andhra PradeshLatest News

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయాలు..ఉద్యోగులకు గుడ్‌న్యూస్, రాజధాని నిర్మాణానికి కొత్త ఊపు!

AP Cabinet : లోక్‌భవన్ నిర్మాణానికి రూ. 163 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలకమైన నిర్మాణాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.

AP Cabinet

డిసెంబర్ 11, 2025న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet) రాష్ట్ర చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. మొత్తం 44 కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, పలు కీలకమైన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం… గిరిజన విద్య, సామాజిక సంక్షేమం, పట్టణాభివృద్ధి,రాజధాని నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

గిరిజన సంక్షేమం, ఉద్యోగుల అప్‌గ్రేడ్ విద్యారంగానికి ప్రాధాన్యం.. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్య నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఒక బృహత్తర నిర్ణయం తీసుకుంది. గిరిజన విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలనే ఉద్దేశంతో, ఏకంగా 417 టీచర్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ అప్‌గ్రేడేషన్ ద్వారా ఆయా టీచర్లకు పదోన్నతితో పాటు, మెరుగైన జీతభత్యాలు అందనున్నాయి. ఈ (AP Cabinet)నిర్ణయం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఒక గొప్ప ఊరటనిచ్చింది.

సామాజిక సేవ-ఛైర్మన్లు, సభ్యుల నియామకానికి ఆమోదం.. సాంఘిక సంక్షేమ విభాగంలో సామాజిక సేవలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులను కీలక పదవుల్లో నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. సామాజిక సేవలో అపారమైన అనుభవం ఉన్నవారికి చైర్మన్లు మరియు మెంబర్లుగా స్థానం కల్పిస్తూ ఆమోదం లభించింది. ఈ చర్య ద్వారా సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా, అర్హులైన వారికి చేరడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అమరావతికి మళ్లీ రాజధాని కళ.. లోక్‌భవన్ నిర్మాణానికి రూ. 163 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలకమైన నిర్మాణాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ముఖ్యంగా, రాజధాని ప్రాంతంలో లోక్ భవన్ నిర్మాణానికి సంబంధించి రూ.163 కోట్లతో టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాల బాధ్యతలను వేగవంతం చేసేందుకు, లోక్ భవన్ నిర్మాణం కోసం టెండర్లలో వచ్చిన ఎల్ 1 బిడ్లను ఆమోదించే అధికారాన్ని సీఆర్‌డీఏ (CRDA) కమిషనర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

AP Cabinet
AP Cabinet

అలాగే, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ADC) పరిధిలోని ఈ3 రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన ఎల్ 1 బిడ్‌ను ఆమోదించే బాధ్యతను ఏడీసీ ఎండీకి కేటాయించడం ద్వారా, రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన ప్రక్రియకు వేగం పెంచారు.

పట్టణాభివృద్ధికి భారీ ప్యాకేజీ: అమృత్ 2.0 ప్రాజెక్టులు..పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వ పథకం ‘అమృత్ 2.0’ కింద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై కేబినెట్ దృష్టి సారించింది. 2026 మార్చి 31లోగా పెండింగ్ పనులు ప్రారంభించాలని కేంద్రం చేసిన సూచన నేపథ్యంలో, 506 పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు గాను ప్రభుత్వం రూ.9,613 కోట్ల భారీ నిధులను కేటాయించనుంది. ఈ నిధులతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో తాగునీరు, మురుగునీటి పారుదల వంటి సదుపాయాలు మెరుగుపడనున్నాయి.

చిత్తూరు జిల్లాకు సాగునీటి భరోసా: కుప్పంలో చెక్ డ్యాం నిర్మాణానికి నిధులు.. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి నియోజకవర్గంపై కేబినెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. చిత్తూరు జిల్లా, కుప్పంలో ప్రవహించే కీలకమైన పలార్ నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి గతంలో కేటాయించిన నిధులను పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అదనంగా రూ.15.96 కోట్లు నిధులను మంజూరు చేశారు. ఈ చెక్ డ్యాం నిర్మాణంతో కుప్పం ప్రాంత రైతులకు స్థిరమైన సాగునీరు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

మొత్తం మీద, ఈ (AP Cabinet)కేబినెట్ నిర్ణయాలు గిరిజన సంక్షేమం, ఉద్యోగుల ప్రయోజనాలు, రాజధాని నిర్మాణం, మరియు పట్టణాభివృద్ధి రంగాలలో రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేశాయని చెప్పొచ్చు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button