Erra Matti Dibbalu
విశాఖపట్నం అంటే అందరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్‌లు. అలా భీమునిపట్నం వైపు వెళ్తే అక్కడ ఎర్రమట్టి దిబ్బల(Erra Matti Dibbalu) లో కోట్లాది ఏళ్ల క్రితం నాటి భూమి చరిత్ర అందరికీ కనిపిస్తుంది. దాదాపు 12 వేల నుంచి 20 వేల ఏళ్ల క్రితం సముద్ర మట్టాలలో వచ్చిన చాలా మార్పులు, గాలుల ప్రభావం వల్ల ఈ అరుదైన ఇసుక మేటలు ఏర్పడ్డాయట.
అందుకే దేశంలోనే అత్యంత అరుదైన ఈ భౌగోళిక ప్రాంతం ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్ సొంతం. ఇది కేవలం పర్యాటక ప్రాంతమే కాదు, భూమి పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు, జియాలజిస్టులకు ఇదొక తెరిచిన పుస్తకం వంటిది అంటారు
ఈ దిబ్బలు ఎరుపు రంగులో ఉండటానికి కారణం వాటిలోని ఐరన్ ఆక్సైడ్. వర్షం నీరు , గాలి వల్ల ఈ మట్టిలో చిత్ర విచిత్రమైన లోయలు, శిఖరాలు ఏర్పడ్డాయి. ఇక్కడ నిలబడి చూస్తే మనం అంగారక గ్రహం (Mars) మీద ఉన్నామా అనే అనుభూతి చాలామందికి కలుగుతుంది.
ఇక సూర్యోదయం , సూర్యాస్తమయ సమయాల్లో ఈ ప్రాంతం ఎంతో మనోహరంగా కనిపిస్తుందంటారు ప్రకృతి ప్రేమికులు. పర్యాటకులయితే ఇక్కడ ఫోటోగ్రఫీ చేయడానికి , ప్రకృతి అందాలను చూడటానికే దేశ విదేశాలు నుంచి కూడా వస్తుంటారు.
అయితే పర్యావరణ మార్పుల వల్ల, అలాగే మానవ తప్పిదాల వల్ల ఈ అరుదైన భౌగోళిక నిధి అంతరించిపోయే ప్రమాదముం దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత భూభాగంలో కేవలం విశాఖపట్నంతో పాటు తమిళనాడులోని తేరి ప్రాంతాలలో మాత్రమే ఇటువంటి ఎర్రమట్టి దిబ్బలు(Erra Matti Dibbalu) కనిపిస్తాయి. వీటిని ఇప్పటికే భూగర్భ శాస్త్ర సర్వే సంస్థ (GSI) జాతీయ భౌగోళిక స్మారక చిహ్నంగా గుర్తించింది. అయితే
ఇక్కడికి వెళ్లే వారు ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకుండా, ప్రకృతిని కాపాడుకోవాలని కోరుతున్నారు అక్కడి స్థానికులు, పర్యావరణ ప్రేమికులు. ఒక అద్భుతమైన చారిత్రక సంపదను మన తరువాతి తరాలకు అందించడం మన అందరి బాధ్యత అన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.
