AP: ఏపీకి ముంచుకొస్తున్న వరద ముప్పు.. భారీ వర్షాలతో ఆ జిల్లాల్లో హై అలర్ట్

AP: పట్టణ ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించడం, ట్రాఫిక్ సమస్యలను వెంటనే పరిష్కరించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.

AP

ఆంధ్రప్రదేశ్‌(AP)లో అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రాబోయే కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి మరియు కేంద్ర పాలిత ప్రాంతం యానాంలలో ఆకస్మిక వరదల (flash flood) హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాలకు చేరుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు వర్షాలు ఎక్కువగా పడతాయి. ఈ పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గడచిన 24 గంటల్లో ఏలూరు వద్ద 22 సెం.మీ., ముమ్మిడివరంలో 18 సెం.మీ., అమలాపురంలో 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ఈ భారీ వర్షాల వల్ల నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. కలింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో ప్రమాద సూచికలు పెంచారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతుండటంతో.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి ఎగువ నుంచి ఏకంగా 4 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

AP

ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి AP ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. NDRF, SDRF బృందాలను సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంచారు. కృష్ణా నది సమీపంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించడం, ట్రాఫిక్ సమస్యలను వెంటనే పరిష్కరించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ కూడా పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ప్రజలు వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లడం వంటివి చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచి ఉండటంతో వాహనాలను జాగ్రత్తగా నడపాలి. ఈ వాతావరణ పరిస్థితులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి హెల్ప్‌లైన్‌లను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు సురక్షితంగా ఉండటం, ప్రభుత్వ సూచనలను పాటించడం ఈ సమయంలో చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు.

 

Exit mobile version