Free bus : ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ, ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ పథకం పేరు, దాని పరిధిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈలోగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక ఫోటో, ఈ పథకానికి ‘స్త్రీ శక్తి’ అనే పేరు పెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలకు బలం చేకూర్చింది.
Free bus
ఉచిత ప్రయాణానికి(Free bus travel) సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) జారీ చేయబోయే జీరో టిక్కెట్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ టిక్కెట్‌పై ‘స్త్రీ శక్తి’ అని ముద్రించి ఉంది. ఈ జీరో టిక్కెట్‌లో డిపో పేరు, ప్రయాణించే రూట్, అలాగే టిక్కెట్ ధర, ప్రభుత్వ రాయితీ సున్నాగా ముద్రించారు. ఈ టిక్కెట్‌ను చూసిన తర్వాత, ప్రభుత్వం ఈ పథకానికి ‘స్త్రీ శక్తి’ అనే పేరును ఖరారు చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకంపై స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేయనుంది. మహిళలు ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డు లేదా ఓటరు కార్డు వంటి ఏదైనా గుర్తింపు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది. కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చే వరకు పాత బస్సులనే ఈ పథకానికి వినియోగించుకోనున్నారు. బస్సుల వేళల్లో, సిబ్బంది విధుల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు పేర్కొన్నారు.
ఈ పథకం పరిధిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు మాత్రం ఈ పథకం ఉమ్మడి జిల్లాల వరకు పరిమితం అయ్యే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. అంటే, ఒక జిల్లాలోని మహిళలు ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.అయినా కూడా కొన్ని ప్రత్యేక షరతులతో ఏపీ వ్యాప్తంగా ప్రయాణానికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి, పల్లె వెలుగు( Pallevellugu), అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు(Express Buses)ల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా, నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ తో పాటు, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఈ సదుపాయం కల్పించనున్నారు. ఈ పథకం పూర్తి వివరాలు, మార్గదర్శకాలు అధికారికంగా విడుదలైన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.