NRI:తిరుమల వెళ్లాలనుకునే ఎన్నారైలకు గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా శ్రీవారి దర్శనం

NRI: ఎన్నారైలు నేరుగా వైకుంఠం కాంప్లెక్స్-1 సమీపంలోని సుపథం ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లి, అక్కడ తమ పాస్‌పోర్ట్ , ఇతర పత్రాలను సమర్పించి రూ. 300 టికెట్ తీసుకోవచ్చు.

NRI

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే ప్రవాస భారతీయులకు (NRI) తిరుమల తిరుపతి దేవస్థానం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే భక్తులు తక్కువ సమయం సెలవులపై వస్తుంటారు కాబట్టి, వారు సాధారణ క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా ‘సుపథం’ మార్గం ద్వారా ప్రత్యేక దర్శనం చేసుకునే వెసులుబాటును టీటీడీ కల్పించింది.

దీని కోసం ఎన్నారైలు ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారు నేరుగా వైకుంఠం కాంప్లెక్స్-1 సమీపంలోని సుపథం ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లి, అక్కడ తమ పాస్‌పోర్ట్ , ఇతర పత్రాలను సమర్పించి రూ. 300 టికెట్ తీసుకోవచ్చు. సాధారణంగా ఈ దర్శన సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది, అయితే భక్తుల రద్దీని బట్టి టీటీడీ అధికారులు ఈ సమయాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది.

ఈ ప్రత్యేక దర్శనం పొందాలనుకునే వారు కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా భారతదేశానికి చేరుకున్న తేదీ నుండి 30 రోజుల్లోపు మాత్రమే ఈ సుపథం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనానికి వెళ్లే సమయంలో ఒరిజినల్ పాస్‌పోర్ట్‌తో పాటు, పాస్‌పోర్ట్‌పై ఉన్న ఇమ్మిగ్రేషన్ అరైవల్ స్టాంప్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

NRI

విదేశీ పౌరసత్వం ఉన్నవారు తమ ఓసీఐ (OCI) లేదా పీఐఓ (PIO) కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్నారైలతో పాటు వచ్చే వారి స్థానిక కుటుంబ సభ్యులకు ఈ సుపథం మార్గం ద్వారా అనుమతి ఉండదు.. వారు విడిగా ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి.

వసతి , ఆర్జిత సేవల కోసం మాత్రం ఎన్నారైలు ముందుగానే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా పాస్‌పోర్ట్ నంబర్‌ను ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగించి బుకింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా సుప్రభాతం, తోమాల వంటి సేవలను లక్కీ డిప్ ద్వారా పొందొచ్చు.

మరోవైపు భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే నకిలీ వెబ్‌సైట్లు , సోషల్ మీడియా పేజీల పట్ల టీటీడీ భక్తులను హెచ్చరించింది. శ్రీవారి సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనం ఇప్పిస్తామని నమ్మించే నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని, కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారానే అన్ని రకాల బుకింగ్‌లు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వైష్ణవ యాత్రాస్ వంటి ఫేక్ పేజీలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భక్తులు తమ వ్యక్తిగత , ఆర్థిక వివరాలను గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దని టీటీడీ స్పష్టం చేసింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version