MS Dhoni
ఐపీఎల్ అనగానే ముందు గుర్తొచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్.. ఆ టీమ్ అనగానే గుర్తొచ్చేది ఇంకెవరు మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)నే… అసలు ధోనీ అంటే చెన్నై,.. చెన్నై అంటే ధోనీ.. వేరే రాష్ట్రానికి చెందిన ప్లేయర్ అయినా సరే ధోనీకి, తమిళఫ్యాన్స్ కు ఉండే బాండింగ్ అంతా ఇంతా కాదు… ధోనీ కేవలం ఫేస్ ఆఫ్ ది చెన్నై మాత్రమే కాదు ఫేస్ ఆఫ్ ది ఐపీఎల్ కూడా.. అందుకే ధోనీ లేకుండా ఐపీఎల్ ను, చెన్నై టీమ్ ను ఊహించుకోలేం. కొంత కాలంగా ధోనీ రిటైర్మెంట్ పై చర్చ జరుగుతూనే ఉంది.
ఎప్పటికప్పుడు ధోనీ ఆ వార్తలను ఖండిస్తూ వస్తున్నాడు. గత సీజన్ నుంచీ ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. గత ఏడాది ఐపీఎల్ కు ముందు ధోనీ మోకాలికి సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించినా.. గ్రౌండ్ లో మునుపటిలా వేగం కనిపించలేదు. అందుకే గత సీజన్ లో ఎక్కువసార్లు ఇంపాక్ట్ ప్లేయర్ తరహాలో ఆఖర్లో బ్యాటింగ్ కు దిగడం ఆశ్చర్యపరిచింది. ఇక అదే సీజన్ ధోనీకి చివరిదంటూ జోరుగా ప్రచారం సాగింది.
ధోనీ కూడా కామెంటేటర్లు టాస్ సమయంలో ఇదే ప్రశ్న అడిగినా ఎప్పటికప్పుడు దానిని దాటవేస్తూ వచ్చాడు. ఇప్పుడు మరోసారి ఐపీఎల్ ముంగిట మహేంద్రుడి రిటైర్మెంట్ పై చర్చ మొదలైంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ధోనీ రిటైర్మెంట్ పై కీలక ప్రకటన చేసింది. ధోనీ వచ్చే సీజన్ లో ఆడతాడా లేదా అనే ప్రశ్నకు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు.
2026 ఐపీఎల్ లో ధోనీ ఆడతాడని సీఎస్కే ప్రకటించారు.. ధోనీ లేకుండా ఉండదంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు. ఒకవేళ ఆటకు వీడ్కోలు పలికినా ఏదో ఒక పాత్ర ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతోనే ఉంటాడని గతంలోనే ఆయన స్పష్టం చేశారు. దీంతో వచ్చే సీజన్ లో ధోనీ ఆడడంపై క్లారిటీ వచ్చేసింది.
అయితే చెన్నై సంజూ శాంసన్ ను ట్రేడింగ్ లో తీసుకోవడంతో ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశముంది. భవిష్యత్తు కోసం ధోనీ వారసుడిపై ఫోకస్ పెట్టిన సీఎస్కే సంజూను వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ధోనీ ఇప్పటి వరకూ 278 మ్యాచ్ లలో 5439 పరుగులు చేశాడు.దీనిలో 24 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే వికెట్ల వెనుక 158 క్యాచ్ లు, 47 స్టంపౌంట్లలో భాగమయ్యాడు.
