Justice
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (ఏపీ హైకోర్టు)లో న్యాయమూర్తుల సంఖ్య తాజాగా పెరిగింది. అలహాబాద్ హైకోర్టు నుంచి తిరిగి బదిలీపై వచ్చిన జస్టిస్(Justice) దొనాడి రమేశ్ శుక్రవారం (అక్టోబరు 17) హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేశ్‌చే ప్రమాణం చేయించారు. జస్టిస్ దొనాడి రమేశ్ గతంలో 2020, జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2023, జూలై 24న అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాజాగా కొలీజియం సిఫారసుతో ఆయన తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ పదవీ విరమణ తేదీ (Retirement Date) జూన్ 26, 2027 వరకు పదవీకాలంలో కొనసాగనున్నారు.
కాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు, న్యాయవ్యవస్థలోని ప్రముఖులు హాజరయ్యారు. వారిలో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ ఐ. సాంబశివ ప్రతాప్, రిజిష్ట్రార్ జనరల్ వైవీఎస్‌బీజీ పార్థసారథి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె. చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్. ద్వారకానాధ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అండ్ బార్ కౌన్సిల్ ప్రతినిధులు జస్టిస్ రమేశ్‌కు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 37 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం ఉంది. జస్టిస్(Justice) దొనాడి రమేశ్ చేరికతో హైకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య మరింత పెరిగింది. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరగడం వలన, కోర్టులో పేరుకుపోయిన కేసుల పరిష్కారం మరింత వేగవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ బదిలీతో పాటు, గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్ సుబేందు సమంత కూడా ఏపీ హైకోర్టుకు బదిలీ అయినట్టు తెలుస్తోంది.