Hidma encounter
దేశంలో మావోయిస్టుల అంతం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రానున్న మార్చి 31, 2026 నాటికి గడువు విధించడంతో.., మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దండకారణ్యంలో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. ఇదే సమయంలో నవంబర్ 19వ తేదీన మారేడుమిల్లి ప్రాంతంలో జరిగినట్లుగా అధికారులు ప్రకటించిన ఒక ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా(Hidma encounter), ఆయన భార్య రాజేతో పాటు పలువురు అగ్రనేతలు మరణించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ఈ (Hidma encounter)ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తూ, దీని వెనుక ఉన్న అంశాలను వివరిస్తూ మావోయిస్టు పార్టీ తరఫున అధికార ప్రతినిధి కామ్రేడ్ అభయ్ పేరుతో నవంబర్ 20న ఒక సంచలన లేఖ విడుదల చేసింది.
మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ఈ లేఖలో, భద్రతా దళాల కథనాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ (Hidma encounter)ఎన్‌కౌంటర్ కేవలం అబద్ధాల కథ మాత్రమేనని ఆరోపించారు. కామ్రేడ్ మాడ్వి హిడ్మా, కామ్రేడ్ రాజే , శంకర్‌తో పాటు మరికొందరిని చికిత్స కోసం విజయవాడకు వెళ్లిన సమయంలో, కొందరి ద్రోహం వల్ల సమాచారం లీకై, ఆంధ్ర ఎస్‌ఐబీ పోలీసులు నవంబర్ 15న వారిని నిరాయుధులుగా అదుపులోకి తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, అత్యంత క్రూరంగా హత్య చేశారని, తర్వాత ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని తప్పుడు ప్రకటనలతో ఎన్‌కౌంటర్ కథ అల్లారని అభయ్ ఆరోపించారు.
ఈ అమానుష చర్యకు వ్యతిరేకంగా నవంబర్ 23వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రజలకు మరియు తమ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
కేంద్రంలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మనువాదులు దేశవ్యాప్తంగా పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని, దీని అంతిమ లక్ష్యం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కార్పొరేట్ దోపిడీకి మార్గం సుగమం చేయడమేనని మావోయిస్టు పార్టీ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమరులైన నాయకుల విప్లవ సాంప్రదాయాన్ని, ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని శపథం చేస్తూ, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులు, రైతాంగం, యువత, మేధావులు భాగస్వాములు కావాలని పార్టీ పిలుపునిచ్చింది.
మరోవైపు మావోయిస్టు పార్టీ, అమరుడైన కామ్రేడ్ హిడ్మా సేవలను గుర్తు చేస్తూ ఆయన జీవిత చరిత్రను వివరించింది.
హిడ్మా 1974లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని పువర్తి గ్రామంలో పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. ఐదవ తరగతి వరకు చదువుకున్న హిడ్మా చిన్నతనంలోనే ఉద్యమ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.
1997 డిసెంబర్‌లో పూర్తికాల పార్టీ సభ్యుడిగా చేరిన ఆయన, 2005లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 2009లో బెటాలియన్ కమాండర్‌గా ఎదిగారు. 2020లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా, ఆ తర్వాత 2024 ఆగస్టులో అత్యున్నత స్థాయియైన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆయన మార్క్సిజం, లెనినిజం, మావోయిజంపై లోతైన అధ్యయనం చేసి, సైద్ధాంతికంగా ఎదిగారు. మిలిటరీ రంగంలో అపార అనుభవం సాధించి, అనేక మిలిటరీ చర్యలను విజయవంతంగా అమలు చేసి పీఎల్‌జీఏను బలోపేతం చేశారు.
కార్పొరేట్ మీడియా హిడ్మాను దుర్మార్గుడిగా చిత్రీకరించినా, ప్రజల హృదయాల్లో ఆయనకు గౌరవ స్థానం చెరగదని పార్టీ పేర్కొంది. భగత్ సింగ్, కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు చరిత్రలాగే హిడ్మా చరిత్ర కూడా భారత విప్లవోద్యమంలో చెరగని ముద్ర వేస్తుందని కేంద్ర కమిటీ ప్రకటించింది. అమరులైన హిడ్మా, రాజే, శంకర్, చైతు, కమల, మల్లేశ్, దేవా , ఇతరులకు పార్టీ రెడ్ సెల్యూట్ అర్పిస్తున్నట్లు చెబుతూ లేఖను ముగించింది.
