Nara Lokesh
ఆంధ్రప్రదేశ్‌కు మరో గ్లోబల్ గుర్తింపు దక్కబోతోంది. దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్(renewable skill drive)కు విజయవాడ వేదిక కానుంది. ఆగస్ట్ 6న నోవాటెల్ హోటల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రం గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవానికి కేంద్రబిందువుగా మారేందుకు సిద్ధమవుతోంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ భాగస్వామ్యంతో ఈ మెగా డ్రైవ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 250కి పైగా పరిశ్రమల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని దూసుకెళ్తున్న వేళ… ఆంధ్రప్రదేశ్ ఈ రంగానికి మానవ వనరుల హబ్‌గా మారేందుకు ఈ స్కిల్లింగ్ డ్రైవ్ ఒక కీలకమైన అడుగు కానుంది.
ఈ ప్రోగ్రామ్ ద్వారా వేలాది మంది యువతకు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో తయారీ, ఇన్‌స్టలేషన్, ఆపరేషన్స్, నిర్వహణ వంటి విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. క్లీన్ ఎనర్జీ, వాతావరణ మార్పుల వంటి గ్లోబల్ ఛాలెంజ్‌లకు తగిన పని దళం సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 2030 నాటికి 160 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఈ కార్యక్రమంలో మూడు హై-ఇంపాక్ట్ ప్యానెల్ డిస్కషన్స్ కూడా నిర్వహించనున్నారు. పరిశ్రమల దైనందిన అవసరాలకు తగ్గ స్కిల్లింగ్ రోడ్‌మ్యాప్‌ను పాలసీ మేకర్లు, పరిశ్రమల దిగ్గజాలు, శిక్షణ సంస్థలు కలిసి రూపొందించనున్నారు. ప్రైవేట్ సెక్టార్ గ్రీన్ స్కిల్లింగ్ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.ఈ డ్రైవ్‌తో ఆంధ్రప్రదేశ్ కేవలం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలోనే కాకుండా, గ్లోబల్ టాలెంట్ ఎగుమతిదారుగా కూడా గుర్తింపు పొందనుంది.