Padma Shri :తెలుగు రాష్ట్రాలకు 11 పద్మ అవార్డులు.. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ

Padma Shri : తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది ప్రముఖులు పద్మ అవార్డుల జాబితాలో నిలిచి తమదైన ముద్ర వేశారు.

Padma Shri

భారత ప్రభుత్వం 2026 ఏడాదిలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 131 మంది ప్రతిభామూర్తులను ఈ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. ఇందులో ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, అలాగే 113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి.

అయితే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది ప్రముఖులు ఈ జాబితాలో నిలిచి తమదైన ముద్ర వేశారు. తెలంగాణ నుంచి ఏడుగురు,ఏపీ నుంచి నలుగురు ఈ అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ పురస్కారాల్లో సినీ గ్లామర్‌తో పాటు, క్రీడలు, సైన్స్ , సామాజిక సేవ చేసిన అన్‌సంగ్ హీరోలకు కూడా పెద్దపీట వేశారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటకిరీటిగా గుర్తింపు పొందిన రాజేంద్రప్రసాద్‌ను కళా విభాగంలో పద్మశ్రీ (Padma Shri )వరించింది. హాస్యంతో పాటు వైవిధ్యభరితమైన పాత్రలతో దశాబ్దాలుగా అలరిస్తున్న రాజేంద్రప్రసాద్ సేవలకు ఈ గుర్తింపు లభించింది. అలాగే ప్రముఖ నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్‌కు కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. జాతీయ స్థాయిలో చూస్తే బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు పద్మవిభూషణ్‌, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్‌ పురస్కారాలను ప్రకటించారు.

ఇటు ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్‌ ప్రకటించారు. క్యాన్సర్ చికిత్సలో ఆయన చేస్తున్న అంతర్జాతీయ స్థాయి కృషికి గాను ఈ గౌరవం దక్కింది. అదేవిధంగా తెలంగాణ నుంచి డాక్టర్ విజయ్ ఆనంద్‌రెడ్డికి కూడా క్యాన్సర్ చికిత్సలో చేసిన విశేష సేవలకు పద్మశ్రీ లభించింది. జన్యు పరిశోధనల్లో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్‌ను పద్మశ్రీ వరించింది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో గడ్డమనుగు చంద్రమౌళికీ పద్మశ్రీ లభించింది.

Padma Awards

ఇటు అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు పద్మశ్రీ వరించింది. కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డికి.. కళా విభాగంలో ఈ గౌరవం లభించింది. సాహిత్యం , విద్యా రంగంలో వెంపటి కుటుంబ శాస్త్రిని పద్మశ్రీతో సత్కరించారు. ఇక క్రీడా రంగంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ(Padma Shri ) రావడం విశేషం. క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించడమే కాకుండా, జట్టును విజయపథంలో నడిపిస్తున్నరోహిత్ కృషికి ఈ గుర్తింపు దక్కింది.

ఇక సామాన్య రైతు బిడ్డ నుంచి పద్మశ్రీ వరకు ఎదిగిన మామిడి రామారెడ్డికి పాడి, పశుసంవర్ధక విభాగంలో ఈ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. వీరితో పాటు కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, గూడూరు వెంకట్రావులకు తమ రంగాల్లో చేసిన విశేష సేవలకు పద్మశ్రీ లభించింది.

ఇతర రాష్ట్రాల నుంచి కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌కు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ పురస్కారం దక్కింది. వీరందరికీ త్వరలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక వేడుకలో ఈ పురస్కారాలను అందజేయనున్నారు.

Badrinath:బద్రీనాథ్ యాత్ర 2026..ఏప్రిల్ 23న తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు

 

Exit mobile version