Quantum Valley: రేపటి టెక్ ప్రపంచానికి కేంద్రంగా అమరావతి.. వేగంగా రూపుదిద్దుకుంటున్న క్వాంటం వ్యాలీ

Quantum Valley: క్వాంటం వ్యాలీ నిర్మాణం లింగాయపాలెం సమీపంలో, సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకుని సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో జరగనుంది.

Quantum Valley

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ప్రపంచస్థాయి టెక్నాలజీ , పరిశ్రమలకు వేదికగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘క్వాంటం వ్యాలీ’ (Quantum Valley) రూపకల్పనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సచివాలయంలో సమావేశమై, క్వాంటం వ్యాలీకి సంబంధించిన భవన నమూనాలను తాజాగా సమీక్షించారు. అమరావతిని టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పంలో ఈ ప్రాజెక్టు కీలక భూమిక పోషించనుంది.

క్వాంటం వ్యాలీ(Quantum Valley) నిర్మాణం లింగాయపాలెం సమీపంలో, సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకుని సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో జరగనుంది. ప్రాజెక్టు అమలులో వేగాన్ని ప్రదర్శిస్తున్న అధికారులు, వచ్చే ఏడాది జనవరి నుంచే ఇక్కడ ప్రాథమిక స్థాయి కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల పనులను (Infrastructure Development) చురుగ్గా చేపట్టి, వేగం పెంచుతున్నారు.

Quantum Valley

ఈ ప్రాజెక్టులో ఒక ప్రధాన భవనంతో పాటు చుట్టూ ఎనిమిది టవర్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ భవనాలన్నీ కలిసి మొత్తం 80 లక్షల చదరపు అడుగుల ప్రాంతంలో రూపుదిద్దుకుంటాయి. ఇందులో అత్యాధునిక పరిశోధన సంస్థలు, వినూత్న స్టార్టప్‌లు , ప్రముఖ టెక్ కంపెనీలకు చోటు కల్పించబడుతుంది.

క్వాంటం వ్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ప్రధాన భవనాన్ని ‘A’ అక్షరం ఆకారంలో డిజైన్ చేయడం విశేషం, ఇది అమరావతి పేరుకు సంకేతంగా ఉంటుంది. 45 వేల అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ సెంట్రల్ నిర్మాణం, భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి కేంద్రబిందువుగా నిలవనుంది.

క్వాంటం వ్యాలీ(Quantum Valley) పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలైన తర్వాత, అమరావతిలో ఒక బలమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఎకోసిస్టమ్ (IT Ecosystem) ఏర్పడుతుందని, దీని ద్వారా వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version