Cockfights: సంక్రాంతి కోడి పందేల సందడి షురూ..పల్లె ఆనవాయితీ వెనుక వేల కోట్ల జూదం

Cockfights: సంక్రాంతి మూడు రోజుల్లో (భోగి, సంక్రాంతి, కనుమ)నే ఆంధ్రప్రదేశ్‌లో జరిగే నగదు ప్రవాహం ఒక చిన్న రాష్ట్ర బడ్జెట్‌తో సమానంగా ఉంటుందంటే కాస్త అతిశయంగా ఉన్నా కూడా ఇదే నిజం.

Cockfights

తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆంధ్రాలోని కోస్తా తీరం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రణరంగాన్ని తలపిస్తాయి. పచ్చని పొలాలు, పిండి వంటలు, గంగిరెద్దుల సందడి ఒకవైపు కనువిందు చేస్తుంటే..మరోవైపు బరుల వద్ద పుంజుల కేకలు(Cockfights), పందెగాళ్ల అరుపుల సందళ్లు వినిపిస్తాయి.

ఇవి కేవలం కోళ్ల మధ్య జరిగే (Cockfights)పోరాటాలు మాత్రమేనా అంటే కాదు.. గౌరవం, ప్రతిష్ట, వీరత్వం , వందల కోట్ల రూపాయల జూదం కలగలిసిన ఒక వింతైన సంస్కృతిగా మారిపోయింది. చట్టపరమైన నిషేధాలు ఉన్నా.. ఏటా ఈ పందేల క్రేజ్ పెరుగుతూనే ఉంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అసలు సంక్రాంతికి, కోడి పందేలకు ఈ మూడు రోజుల్లో వేల కోట్ల రూపాయల నగదు ప్రవాహం ఎలా జరుగుతుందో తెలిస్తే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

నిజానికి ఈ కోడి పందేల (Cockfights)చరిత్ర దాదాపు నాలుగు నుంచి ఆరు వేల ఏళ్ల నాటిదని చరిత్రకారులు చెబుతుంటారు. “కుక్కుట శాస్త్రం” ఆధారంగా ప్రాచీన రాజులు తమ వీరత్వాన్నిఇతర రాజ్యాలకు నిరూపించుకోవడానికి ఈ పోటీలను నిర్వహించేవారట. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం వంటి చారిత్రక ఘట్టాలకు కూడా కోడి పందేలే బీజం వేశాయనే కథనాలు చాలానే ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఆ తర్వాత ఇవి కేవలం వినోదం కోసం, చిన్న చిన్న పందేలతో సాగేవి. కానీ మెల్లమెల్లగా ఇది ఒక బ్లడ్ స్పోర్ట్‌గా మారిపోయింది. నెలల తరబడి పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం,వాటికి ప్రత్యేక ఆహారం అందించడం, వాటి కాళ్లకు పదునైన కత్తులు కట్టడం, ఓడిపోయిన కోడి ప్రాణాలు కోల్పోవడం వంటివి ఇప్పుడు ఈ ఆటలో ప్రత్యేకత అంశాలుగా అయ్యాయి. ఇది ఒక రకమైన గౌరవ పోరుగా మారి, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు కూడా తమ పట్టును నిరూపించుకునే వేదికగా ఇది మారిపోయింది.

Cockfights

మూడు రోజుల్లో 2000 కోట్ల వ్యాపారం – ఒక కళ్లు చెదిరే ఎకానమీ.. సంక్రాంతి మూడు రోజుల్లో (భోగి, సంక్రాంతి, కనుమ)నే ఆంధ్రప్రదేశ్‌లో జరిగే నగదు ప్రవాహం ఒక చిన్న రాష్ట్ర బడ్జెట్‌తో సమానంగా ఉంటుందంటే కాస్త అతిశయంగా ఉన్నా కూడా ఇదే నిజం. అధికారిక అంచనాల ప్రకారం, ఈ మూడు రోజుల్లో సుమారు రూ. 2000 కోట్లకు పైగా బెట్టింగ్ జరుగుతోంది.

కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లోనే సుమారు 700 నుంచి 800 కోట్లు చేతులు మారుతుంటాయి. ఒక్కో పందెంపై లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ కాస్తారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి వచ్చే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ్యాపారులు, విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐలు ఈ పందేల్లో భారీగా పెట్టుబడులు పెడతారు.

కేవలం బెట్టింగ్ మాత్రమే కాదు, దీని చుట్టూ ఒక భారీ సపోర్టింగ్ బిజినెస్ కూడా నడుస్తుంది. బరుల వద్ద ఏర్పాటు చేసే తినుబండారాల స్టాల్స్, మద్యం విక్రయాలు, గుండాట, పార్కింగ్ ఫీజుల ద్వారానే నిర్వాహకులు కోట్లు సంపాదిస్తారు. ఒక్క మద్యం వ్యాపారమే ఈ నాలుగు రోజుల్లో సుమారు రూ. 15 కోట్ల రూపాయల దాటి జరుగుతుందని అంచనా.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఈ పందేల వెనుక పుంజుల పెంపకం అనేది ఒక ప్రత్యేకమైన పరిశ్రమగా మారిపోయింది. కొక్కిరాయి, డేగ, అబ్రాస్, నెమలి వంటి జాతి పుంజులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఒక్కో పుంజు ధర 20 వేల నుంచి మొదలై 5 లక్షల రూపాయల వరకు పలుకుతుంది.

ఈ కోళ్లకు ఇచ్చే ఫుడ్, ట్రైనింగ్ కూడా చాలా ఖరీదైనవి. బాదం పప్పులు, జీడిపప్పు, ఉడికించిన గుడ్లు, కీమా వంటి పోషకాహారాన్ని అందిస్తూ, వాటికి ఈత కొట్టించడం వంటి కఠినమైన వ్యాయామాలు చేయిస్తారు. ఈ కోళ్ల ట్రైనింగ్ శిబిరాల ద్వారానే ఏటా 40 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ జరుగుతుంది. కేవలం ఒక పందెం కోసం కోడిని రెడీ చేయడానికి యజమానులు సుమారు రూ. 25 వేల వరకు ఖర్చు చేస్తారు.

నిజానికి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు అనిమల్స్ చట్టం ప్రకారం జంతువులను హింసించడం నేరం. హైకోర్టు కూడా ఈ పందేలను పూర్తిగా నిషేధించాలని ఆదేశించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. పోలీసులు ఏటా కేసులు నమోదు చేసి, బరులను సీజ్ చేస్తున్నా, ఏదో ఒక మూల పందేలు సాగుతూనే ఉన్నాయి.

చట్టం ఒకవైపు లాగుతుంటే, పల్లె భావోద్వేగాలు , రాజకీయ అండదండలు మరోవైపు లాగుతున్నాయి. జంతు ప్రేమికులు ఈ రక్తపాతాన్ని, బర్డ్ హింసను ఆపాలని కోరుతుంటే, ఇది తమ పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కృతి అని పందెగాళ్లు వాదిస్తున్నారు.

ఏది ఏమైనా, సంక్రాంతి కోడి పందేలు(Cockfights) అనేవి ఇప్పుడు కేవలం పండుగ ఆచారాలు మాత్రమే కావు. అవి ఒక భారీ ఆర్థిక వ్యవస్థగా, సామాజిక హోదాకు చిహ్నంగా రూపాంతరం చెందాయి. భవిష్యత్తులో ఈ పందేలు సంప్రదాయ పద్ధతిలో కత్తులు లేకుండా జరుగుతాయా లేక ఇలాగే వేల కోట్ల జూదంగా సాగుతాయా అనేది చూడాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version