Jindal Land: అసలేంటి ఈ జిందాల్ భూముల వివాదం?

Jindal Land: విజయనగరం జిల్లాలో జిందాల్‌(Jindal Land)కు సంబంధించిన భూముల వివాదం మరోసారి రాజకీయ రంగు పులుముకుంది. దశాబ్దన్నర కాలంగా సాగుతున్న ఈ భూసమస్య, ప్రస్తుతం స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు కారణమైంది.

విజయనగరం జిల్లాలో జిందాల్‌(Jindal Land)కు సంబంధించిన భూముల వివాదం మరోసారి రాజకీయ రంగు పులుముకుంది. దశాబ్దన్నర కాలంగా సాగుతున్న ఈ భూసమస్య, ప్రస్తుతం స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు కారణమైంది. ఒక ప్రజా ప్రతినిధిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిన మరొకరి వ్యూహం బెడిసికొట్టడంతో ఈ వ్యవహారం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

Jindal land dispute

జిందాల్ భూముల వివాదం ఎప్పటిది?

నిజానికి జిందాల్(Jindal) భూముల వివాదానికి(land dispute )మూలం 2007-2008 నాటిది. అప్పట్లో జిందాల్ కంపెనీ అల్యూమినియం పరిశ్రమను స్థాపించేందుకు ఎస్.కోట మండలం బొడ్డవర ప్రాంతంలో సుమారు 1165 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో కొంత భాగం ప్రైవేటు భూములు కాగా, అధికభాగం గిరిజనులకు కేటాయించిన భూములు (అసైన్డ్ ల్యాండ్స్). అయితే, అల్యూమినియం పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు బాక్సైట్ గనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో, జిందాల్ ఆ పరిశ్రమను ఏర్పాటు చేయలేకపోయింది. అప్పటి నుంచి ఈ భారీ విస్తీర్ణంలోని భూమి జిందాల్ నియంత్రణలో నిరుపయోగంగానే ఉంది.

ఖాళీగా ఉన్న ఈ భూముల్లో MSME అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో పార్కులను ఏర్పాటు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం 2022లో ఒక ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఆ సమయంలో కూడా స్థానిక ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. జిందాల్ కంపెనీ నిర్ణీత సమయంలో పరిశ్రమను స్థాపించలేకపోయింది కాబట్టి, సేకరించిన భూములను తిరిగి అసలు యజమానులైన గిరిజనులకే అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రతిపాదనపై పెద్దగా చర్చ జరగలేదు. అయితే, సుమారు పది రోజుల క్రితం జిందాల్ భూముల్లో జేసీబీలతో చదును చేసే పనులు మొదలుకావడంతో ఈ వివాదం ఒక్కసారిగా తిరిగి ప్రజల్లోకి వచ్చింది. దీంతో గిరిజనులు, స్థానికులు మళ్ళీ ఆందోళనకు దిగారు. వారికి స్థానిక వై.యస్.ఆర్.సి.పి. నాయకుడు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సంఘీభావం తెలిపారు.

స్థానిక నాయకుల మధ్య పోరు వల్లే పెరిగిన వివాద తీవ్రత:
ఎమ్మెల్సీ రఘురాజు ప్రభావాన్ని తగ్గించడానికి ఇదే మంచి సమయం అని భావించిన.. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి , అదే నియోజకవర్గానికి చెందిన డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ ఒకటయ్యారు. సాధారణంగా వీరికి మధ్య సఖ్యత లేనప్పటికీ, ఉన్నతాధికారుల ఒత్తిడితో కలిసికట్టుగా వ్యవహరించాల్సి వచ్చిందని ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే , డీసీఎంఎస్ ఛైర్మన్ ఇద్దరూ ఆందోళన చేస్తున్న గిరిజనుల వద్దకు వెళ్లి, సమస్యను పరిష్కరించేందుకు రెండు రోజుల సమయం కోరారు.

అయితే, జిందాల్ భూముల సమస్యపై వారికి పూర్తి స్పష్టత లేకపోయినా, ఈ విషయంలో కొంత తొందరపాటు ప్రదర్శించారనే విమర్శలు వినిపించాయి. జిందాల్ భూముల పరిహారానికి సంబంధించి 15 మంది నిర్వాసితులకు మినహా మిగిలిన వారందరికీ అప్పట్లోనే పరిహారం చెల్లించబడిందని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఇప్పటికే వెల్లడించారు. అయినప్పటికీ, ఎమ్మెల్యే , డీసీఎంఎస్ ఛైర్మన్ జిందాల్ భూముల్లో MSME పార్కులు ఏర్పాటు చేస్తామని, పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది.

మంత్రి ప్రకటనతో స్పష్టత, తగ్గిన ఉద్రిక్తత
ఈ వివాదంపై MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు స్పందించారు. జిందాల్ భూముల్లో MSME పార్క్ ఏర్పాటుపై ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి చర్చ జరగలేదని, అలాంటి ప్రతిపాదన కూడా లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను సాకుగా చూపి కొందరు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడిన మంత్రి, ఈ రాజకీయ గందరగోళానికి తెర దించే ప్రయత్నం చేశారు.

వివాదం వెనుక ఆధిపత్య పోరేనా?
ఎస్.కోట నియోజకవర్గంలోని స్థానిక నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగానే ఈ భూముల వివాదం రాజకీయ అంశంగా మారిందని విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి , డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణల మధ్య నిరంతరం ప్రాబల్యం కోసం పోటీ నడుస్తోంది. దీనికి తోడు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వారి మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వానికి ఒక అదనపు కారకంగా మారారని చెబుతున్నారు.

ఎమ్మెల్సీ రఘురాజు వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ, ఆయన భార్య సుధారాణి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పరిస్థితి రఘురాజును వైసీపీకి పూర్తిగా దూరం కాలేక, తెలుగుదేశం పార్టీకి దగ్గర కాలేక సందిగ్ధంలో పడేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ముగ్గురు నేతల మధ్య కొనసాగుతున్న రాజకీయ పోటీ వల్లే జిందాల్ భూముల వ్యవహారం(land dispute) రాజకీయ రంగు పులుముకుందని ప్రచారం జరుగుతుంది.

మంత్రి కొండపల్లి ఇచ్చిన స్పష్టమైన ప్రకటనతో ఈ వివాదానికి శాంతి లభిస్తుందా, లేక స్థానిక నేతలు మరోసారి కొత్త వివాదానికి తెర తీస్తారా అనేది వేచి చూడాలి మరి.

 

Exit mobile version