BRS
తెలంగాణలో గత ఏడాది చివర్లో గ్రామపంచాయతీ ఎన్నికలతో హంగామా నడిచింది. ఇప్పుడు కొత్త ఏడాదిలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. దీంతో రాజకీయ పార్టీలు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాయి. పల్లె పోరులో కాంగ్రెస్ పైచేయి సాధించినా బీఆర్ఎస్ (BRS) కూడా మంచి ఫలితాలే సాధించింది. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ ఎదురుచూస్తోంది.
ఈ మేరకు పార్టీ శ్రేణులను సన్నధ్ధం చేసే పనిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీగా ఉన్నారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ క్యాడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికల జరగనుండగా.. జనవరి మూడో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సుంది.
దీంతో పార్టీ గుర్తులతో జరగబోతున్న మున్సిపోల్స్ ను బీఆర్ఎస్ (BRS) మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు అర్థమవుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ మరీ అసంతృప్తి వ్యక్తం చేయకున్నా సర్పంచ్ స్థానాల్లో మెరుగైన ఫలితాలు వచ్చి ఉంటే బాగుండేదని అన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్టీ గుర్తుతో జరగని ఎన్నికలు కాబట్టే ఫలితాలు ఇలా వచ్చినట్టు కూడా కేసీఆర్ అభిప్రాయపడినట్టు సమాచారం. అంటే పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా తెలుస్తుందని పరోక్షంగా కేసీఆర్ పార్టీ వర్గాలతో అన్నట్టు భావిస్తున్నారు.
దీంతో కేటీఆర్ ప్రస్తుతం పార్టీ శ్రేణులకు దిశానిర్థేశం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ హవా కనిపించేలా కసరత్తు చేయాలని డిసైడయ్యారు. కాంగ్రెస్ కంటే ఎక్కువ కాకున్నా కనీసం సమానంగా ఫలితాలు సాధిస్తే మాత్రం బీఆర్ఎస్ రాత మారినట్టే. ఇప్పటికే కేటీఆర్ పార్టీ నేతలతో బిజీగా ఉన్నారు.
వరుసగా జిల్లాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నేతలకు మున్సిపల్ ఎన్నికలపై కీలక సూచనలు చేస్తున్నారు. ఎక్కడా కూడా అలసత్వం వద్దని, మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చేలా కలిసికట్టుగా పనిచేయాలని క్యాడర్ కు సూచించారు. పలు జిల్లాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలున్నప్పటకీ వాటిని పక్కన పెట్టాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైన తర్వాత కేసీఆర్ కూడా కీలక సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ నేతలకు చెప్పేశారు. అలాగే తాను కూడా పలు జిల్లాల్లో పర్యటించేందుకు కేటీఆర్ రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ కు గౌరవప్రదమైన ఫలితాలు వచ్చేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని క్యాడర్ కు సూచించారు.
దీనిలో భాగంగా కొన్ని జిల్లాలపై గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందంటూ చెబుతున్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంతవరకూ పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.
Japanese:జపనీస్ సమురాయ్ వంశంలో పవన్ కళ్యాణ్‌కు చోటు.. ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఎలా అయ్యారు?
