New Ration Card
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల (New Ration Card ) జారీ ప్రక్రియను గణనీయంగా సరళీకృతం చేసింది. గతంలో మండల కార్యాలయాల చుట్టూ తిరగడం, స్ట్రిక్ట్ నిబంధనలు పాటించడం వంటి ఇబ్బందులు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజలు తమ ఇంటికి సమీపంలోనే, చాలా సులభంగా రేషన్ కార్డు సేవలను పొందేలా ప్రభుత్వం సచివాలయాలలో కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.
దరఖాస్తు ప్రక్రియలో మార్పులు- ఇంటి వద్దకే సేవలు..కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను స్వీకరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించింది. దీనివల్ల ప్రజలు తమ ఇంటికి సమీపంలోనే, సులువుగా దరఖాస్తు చేసుకోగలుగుతారు.
కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. జనవరి నుంచి జూన్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి తొలివిడతగా జులైలో కొత్త కార్డులు మంజూరు చేశారు. జూలై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరిలో కొత్త కార్డులు అందిస్తారు.
కొత్తగా వివాహం చేసుకున్న దంపతులకు రేషన్ కార్డు (New Ration Card)పొందడం గతంలో ఒక పెద్ద సమస్యగా ఉండేది. మహిళను తల్లిదండ్రుల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి రేషన్ అందక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది.
కొత్తగా పెళ్లయిన దంపతులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి భార్య, భర్త ఆధార్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికెట్, భర్త పాత రేషన్ కార్డు వంటివి తీసుకుని వెళ్తే సరిపోతుంది.
సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్లు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ‘మ్యారేజ్ స్ప్లిట్’ ఆప్షన్ ద్వారా వారి వివరాలను నమోదు చేస్తారు.
వివరాలు నమోదు చేసిన తర్వాత వారికి ఒక నెంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆ దరఖాస్తును వీఆర్వో (VRO) మరియు తహసీల్దారు పరిశీలనకు పంపుతారు. వారి అనుమతి లభించగానే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు.
ముఖ్యంగా, కొత్త కార్డు మంజూరయ్యే లోపు వారికి అత్త వారింట్లోనే రేషన్ అందజేయబడుతుంది, దీనివల్ల వారికి పంపిణీలో ఎలాంటి ఆటంకం ఉండదు.
అంతేకాదు రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన నిబంధనలను కూడా ప్రభుత్వం సులభతరం చేసింది. పిల్లల ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్స్, తల్లిదండ్రుల రేషన్ కార్డు తప్పనిసరి. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత, వీఆర్వో, తహసీల్దారు పరిశీలన , అనుమతి ద్వారా పిల్లల పేర్లు కార్డులోకి ఎక్కుతాయి.
చిరునామా మార్చుకోవడానికి సంబంధించిన కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా సచివాలయాల ద్వారానే జరుగుతుంది.
