Konaseema
తెలుగు నేలపై సంక్రాంతి పండుగను.. ఆ పండుగ పూర్తి వైభవంతో చూడాలంటే కోనసీమకు (Konaseema)మించిన ప్రదేశం మరొకటి లేదు. గోదావరి నది పాయల మధ్య వెలసిన ఈ ప్రాంతం పచ్చని కొబ్బరి తోటలు, పొలాల గట్లు , ఏరులతో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది.
సంక్రాంతి సమయంలో కోనసీమకు వెళ్తే మనం ఒక సరికొత్త లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడి సంప్రదాయాలు, మర్యాదలు , పండుగ వంటకాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా ఈ సెలవుల్లో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపాలనుకునే వారికి కోనసీమ ఒక స్వర్గధామం.
కోనసీమలో పండుగ సంబరాలు భోగి నుంచే అంబరాన్నంటుతాయి. ఇక్కడి ప్రభల తీర్థం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. వందల ఏళ్ల నాటి నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం, రంగురంగుల పూలతో, వస్త్రాలతో అలంకరించిన భారీ ప్రభలను భుజాలపై మోస్తూ పొలాల గట్ల వెంబడి ఊరేగించే దృశ్యం కనువిందు చేస్తుంది.
ముఖ్యంగా జగ్గన్నపేట వంటి గ్రామాల్లో జరిగే ప్రభల ఉత్సవం చూడటానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఎందుకంటే ఇది కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, కోనసీమ ఐకమత్యానికి నిదర్శనంగా చెబుతుంటారు.
కోనసీమలో కేవలం ప్రకృతి అందాలే కాదు, ఆధ్యాత్మికతకు కూడా కొదవ లేదు. సముద్రం , గోదావరి నది కలిసే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దర్శించడం పుణ్యఫలంగా చెబుతారు.
అలాగే అప్పనపల్లి బాల బాలాజీ గుడి, మందపల్లి శనీశ్వరాలయం, మురమళ్ల వీరభద్రస్వామి ఆలయాలు ఇక్కడి ప్రత్యేకతలు. గోదావరి నదిలో హౌస్ బోట్ షికారు చేస్తూ దిండి రిసార్ట్స్ లో బస చేయడం పర్యాటకులకు కొత్త అనుభూతి ఇస్తుందంటారు స్థానికులు. లంక గ్రామాల అందాలు, అక్కడి ప్రజల ఆత్మీయతలు పర్యాటకులను మళ్లీ మళ్లీ రమ్మని పిలుస్తాయి.
కోనసీమ వెళ్తే అక్కడి సంప్రదాయ వంటకాలను రుచి చూడకుండా ఉండలేరు. కొత్త బియ్యంతో చేసే పొంగలి, బొబ్బట్లు, గోదావరి పులస చేప కూర (సీజన్ బట్టి) ఇక్కడ ఫేమస్. అలాగే ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాల రుచి అయితే ఇక ప్రపంచవ్యాప్తం. ఈ పండుగ సెలవుల్లో అచ్చమైన తెలుగుదనాన్ని ఆస్వాదించాలంటే మీ డెస్టినేషన్ కోనసీమకు ఒక్కసారయినా వెళ్లి రావాల్సిందే.
Bhogi Pandlu:లోగిళ్లలో భోగి సందడి.. చిన్నారులపై పోసే ఆ భోగి పండ్ల వెనుక ఉన్న అంతరార్థమిదే..
