YS Jagan
ఏ పార్టీ అయినా ముందుకు సాగాలంటే నేతల కన్నా కార్యకర్తలే ముఖ్యం.. వారిని సరిగ్గా చూసుకోకుంటే పార్టీ గెలుపు కష్టమే.. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే 2024 ఎన్నికల్లో ఎదుర్కొన్నారు వైఎస్ జగన్(YS Jagan).. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తల కంటే వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం కొంపముంచింది.
ప్రతీ ప్రభుత్వ పనికీ వాలంటీర్లే కీలకంగా వ్యవహించడంతో కార్యకర్తలు, నేతలకు జగన్ సంబంధాలు తెగిపోయాయి. పైకి చెప్పకున్నా వైసీపీ అధినేత తీరుపై అప్పట్లోనే వైసీపీ కార్యకర్తలు, పలువురు ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ తమ నియోజకవర్గాలు, గ్రామాల్లో వాలంటీర్ల ఆధిపత్యం పెరిగిపోవడం వారికి అసంతృప్తి మరింత పెంచేసింది. ఫలితంగా ఎన్నికల్లో పార్టీ కోసం తూతూమంత్రంగా పనిచేయడంతో వైసీపీ ఘోరపరాభవానికి ఒక కారణమైంది.
అప్పట్లోనే వైెఎస్ జగన్(YS Jagan) కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఇంత దారుణ ఓటమి ఎదురయ్యేది కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత మెల్లిగా పార్టీ రివ్యూ మీటింగ్స్ లో జగన్ కు కూడా ఈ విషయం అర్థమైంది. ఇప్పుడు జగన్ 2.0 అంటున్న వైసీపీ అధినేత ఈ సారి కార్యకర్తలకే ప్రాధాన్యత అంటూ వరుస ప్రకటనలు చేస్తున్నారు. తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో ఈ సారి కాస్త నిక్కచ్చిగానే వ్యవహరిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజాగా కార్యకర్తల విషయంలో తాను చేసిన తప్పిదాన్ని వైెెఎస్ జగన్(YS Jagan) స్వయంగా అంగీకరించారు.జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేస్తానని ఇటీవలే ప్రకటించిన జగన్ ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా క్యాడర్ తో సమావేశమవుతున్నారు. గతంలో తాను కూడా పాలనమీద ఎక్కువ దృష్టి పెట్టాననీ, కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయినట్టు ఒప్పుకున్నారు.
ఇప్పుడు కార్యకర్తలకే పెద్దపీట ఉంటుందన్న జగన్ వారి ద్వారా ప్రజలకు మరింత మంచి చేసేలా ప్రయత్నిస్తానని చెబుతున్నారు. ఆలస్యంగానైనా జగన్ తన తప్పు సరిదిద్దుకుంటున్నారంటూ పలువురు వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో వాలంటీర్ల కారణంగా ప్రజలతో కార్యకర్తలు, నేతలకు మధ్య సంబంధాలు పూర్తి తెగిపోవడం వారికి నచ్చలేదు.
ఇదే విషయం పలువురు వైఎస్ జగన్(YS Jagan) దృష్టికి తీసుకెళ్లినా ఆయన చుట్టూ ఉన్న క్యాడర్ ఆయనకు చేరనివ్వకుండా తప్పుదోవ పట్టించారంటూ పలువురు వైసీపీ నేతలే పలు సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. దీంతో ఇప్పటికైనా కార్యకర్తలకు వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం వైసీపీ వర్గాల్లో జోష్ పెంచుతోంది.
Arava Sridhar:ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిందితుడా? అమాయకుడా? వారం రోజుల్లో నిజం తేలుతుందా?
