Mini Tibet
మనుషులతో గజిబిజిగా ఉండే పర్యాటక ప్రాంతాలు, రద్దీగా ఉండే బీచ్‌లు చూసి బోర్ కొట్టిన వారికి ఏపీలో ఒక అద్భుతమైన ప్రదేశం వేచి ఉంది. అదే విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని బొంపల్లి అనే అందమైన స్పాట్. ఈ గ్రామాన్ని ఏపీలోని ‘లిటిల్ టిబెట్’ (Mini Tibet )అని పిలుస్తారు.
సాధారణంగా టిబెట్ సంస్కృతి , బౌద్ధారామాలను చూడాలనుకున్నవాళ్లు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకో లేదా కర్ణాటకలోని బైలకుప్పెకో వెళతారు. కానీ ఏపీలోనే అంతటి ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణం కలిగిన బౌద్ధ నివాసం ఉండటం చాలా మం దికి తెలియదు. ఇక్కడికి చేరుకోగానే ఏపీలో ఉన్నామా లేక హిమాలయాల్లోని ఏదైనా టిబెటన్ గ్రామంలో ఉన్నామా అనే సందేహం కలగక మానదంటారు అక్కడికి వెళ్లి చూసొచ్చిన వారు.
బొంపల్లిలోని ఈ బౌద్ధారామం లేదా మోనాస్టరీని దాదాపు దశాబ్దాల క్రితం టిబెట్ నుంచి వలస వచ్చిన శరణార్థుల కోసం నిర్మించారట. ఎత్తయిన కొండల మధ్య, పచ్చని ప్రకృతి ఒడిలో వెలసిన ఈ ప్రాంతం..చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడికి రాగానే ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ధరించిన బౌద్ధ సన్యాసులు (లామాలు) కనిపిస్తారు.
వారి ప్రశాంతమైన లైఫ్ స్టైల్, ఎప్పుడూ సాగే ప్రార్థనలు మనసులోని ఒత్తిడిని ఒక్కసారిగా దూరం చేస్తాయంటారు అక్కడికి వెళ్లినవారంతా. ఇక్కడి ప్రధాన ఆలయంలో బుద్ధుని భారీ విగ్రహం, గోడలపై టిబెటన్ శైలిలో వేసిన రంగురంగుల వాల్ పేపర్లు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఏ సమయంలో చూసినా అక్కడ వినిపించే మంత్రోచ్ఛారణలు, గంటల శబ్దం ఒక రకమైన సాత్విక ప్రకంపనలను కలిగించడం అక్కడి ప్రత్యేకత.
ఇక్కడి ఆలయం మాత్రమే కాదు, ఇక్కడి జీవన విధానం కూడా చాలా డిఫరెంటుగా ఉంటుంది. ఇక్కడ నివసించే బౌద్ధ సన్యాసులు ఎంతో క్రమశిక్షణతో కూడిన పవిత్రమైన కాలాన్ని గడుపుతారు. వారు తమ ఆహారాన్ని తామే పండించుకోవడంతో పాటు, చేనేత వస్త్రాలు, ఆధ్యాత్మిక వస్తువుల తయారీలో ఇక్కడివారు బిజీగా కనిపిస్తూ ఉంటారు.
పర్యాటకులు ఇక్కడ వారు తయారు చేసిన రంగురంగుల ప్రార్థన జెండాలు (Prayer Flags), ధూపం, ఇతర అలంకరణ వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఇక్కడి ప్రజలు చాలా మితభాషులు ,అతిథులను ఎంతో మర్యాదగా ఆహ్వానిస్తారు. సందడి లేని ప్రదేశంలో కాసేపు కళ్లు మూసుకుని మెడిటేషన్ చేసుకోవాలనుకునే వారికి ఈ ప్రాంతం ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది.
బొంపల్లికి వెళ్లడం కేవలం విహారయాత్ర మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప అనుభూతిని కూడా మిగిలిస్తుంది . విజయనగరం లేదా విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు ఆధ్యాత్మిక పర్యటన చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్.
అక్కడి ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన గాలి , బౌద్ధ సన్యాసుల స్నేహపూర్వక ప్రవర్తన అందరినీ మరో లోకానికి తీసుకెళ్తాయి. ఆధునిక కాలంలో మనం కోల్పోతున్న ప్రశాంతతను వెతుక్కుంటూ ఒక్కసారైనా ఈ ‘లిటిల్ టిబెట్’ను సందర్శిస్తే బాగుంటుంది. ప్రకృతిని ప్రేమిస్తూ, మౌనాన్ని ఆస్వాదించే వారికి మాత్రం బొంపల్లి ఇచ్చే అనుభూతి చిరకాలం గుర్తుండిపోతుందనేది మాత్రం నిజం.
Arava Sridhar:ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిందితుడా? అమాయకుడా? వారం రోజుల్లో నిజం తేలుతుందా?
