Business
వ్యాపారం (Business)అనగానే మనకు గుర్తొచ్చేది.. ముందుగా వస్తువులను హోల్ సేల్ లో కొనడం, వాటిని నిల్వ చేయడానికి ఒక గది లేదా గోడౌన్ ఉండటం, ఆ తర్వాత కస్టమర్ల కోసం ఎదురుచూడటం. ఇందులో పెట్టుబడితో పాటు రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.
కానీ ఈ-కామర్స్ ప్రపంచంలో వచ్చిన ‘డ్రాప్ షిప్పింగ్’ అనే విధానం ఈ పద్ధతినే మార్చేసింది. రూపాయి పెట్టుబడి(Business) లేకుండా, ఒక్క వస్తువు కూడా ముందే కొనకుండా సొంతంగా వ్యాపారం చేయడం కేవలం దీనిలోనే సాధ్యమవుతుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యువత ఈ పద్ధతి ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏమిటి? ఇందులో లాభాలు ఎలా వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
డ్రాప్ షిప్పింగ్ అనేది ఒక మూడు వైపుల సంబంధం. ఇందులో కస్టమర్, మీరు (రీసెల్లర్), అలాగే సప్లయర్ ఉంటారు. ఇక్కడ మీరు కేవలం ఒక మీడియేటర్ లాగా పనిచేస్తారు. మీరు ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్ లేదా ఇన్స్టాగ్రామ్/ఫేస్ బుక్ పేజీని క్రియేట్ చేస్తారు. సప్లయర్ దగ్గర ఉన్న ఉత్పత్తుల ఫోటోలను మీ స్టోర్ లో ప్రదర్శిస్తారు.
ఎవరైనా కస్టమర్ మీ వెబ్‌సైట్ లో ఒక వస్తువును కొంటే, వారు మీకు డబ్బులు చెల్లిస్తారు. అప్పుడు మీరు ఆ ఆర్డర్ ను సప్లయర్ కు పంపిస్తారు. ఆ సప్లయరే నేరుగా ఆ వస్తువును ప్యాక్ చేసి కస్టమర్ అడ్రస్‌కు పంపిస్తాడు. ఇక్కడ మీరు వస్తువును తాకరు, ప్యాకింగ్ చేయరు, చివరికి డెలివరీ బాధ్యత కూడా మీది కాదు. ఇదంతా సప్లయరే చూసుకుంటాడు.
అయితే ఇక్కడ మీకు వచ్చే లాభం ఏమిటంటే.. సప్లయర్ ఆ వస్తువును మీకు రూ. 500 కి ఇస్తానన్నాడు అనుకోండి. మీరు మీ వెబ్‌సైట్ లో దాన్ని రూ. 900 కి పెడతారు. కస్టమర్ మీకు రూ. 900 ఇస్తే, దానిలో రూ. 500 సప్లయర్ కు ఇచ్చి, మిగిలిన రూ. 400 మీ లాభం (మార్జిన్) గా ఉంచుకుంటారు. ఈ వ్యాపారంలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇన్వెంటరీ రిస్క్ లేదు. అంటే మీరు వస్తువులను ముందే కొని పెట్టుకోరు కాబట్టి, అవి అమ్ముడుపోవని భయం ఉండదు. మీకు ఆర్డర్ వస్తేనే మీరు సప్లయర్ దగ్గర కొంటారు. దీనివల్ల నష్టపోయే అవకాశమే ఉండదు. ఇంటి నుంచే కేవలం ఒక ల్యాప్ టాప్ లేదా మొబైల్ ద్వారా దీనిని హ్యాండిల్ చేయొచ్చు.
అయితే డ్రాప్ షిప్పింగ్‌లో సక్సెస్ సాధించాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటిది మంచి సప్లయర్ ను ఎంచుకోవడం. ఎందుకంటే సప్లయర్ నాణ్యమైన వస్తువులను పంపిస్తేనే కస్టమర్లు మళ్లీ మీ దగ్గరికి వస్తారు. రెండవది మార్కెటింగ్. మీ వెబ్‌సైట్ గురించి ప్రజలకు తెలియాలంటే సోషల్ మీడియాలో యాడ్స్ ఇవ్వాలి. మూడవది కస్టమర్ సర్వీస్. డెలివరీ ఆలస్యమైనా లేదా వస్తువులో లోపం ఉన్నా మీరు కస్టమర్ కు ఫాలో అప్ చేసి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
