Gold and silver
పండుగ పూట పసిడి ప్రియులకు గట్టి షాక్ తగిలింది. బంగారం, వెండి ధరలు(Gold and silver) ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. రోజురోజుకూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ గమనిస్తే 24 క్యారట్ల బంగారం ధర దాదాపు లక్షన్నర రూపాయలకు చేరువవుతుండగా, కిలో వెండి ధర రెండున్నర లక్షల రూపాయల మార్కును తాకడం విశేషం.
గురువారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై 320 రూపాయలు, 22 క్యారట్ల బంగారంపై 300 రూపాయలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉన్నా.. దేశీయంగా మాత్రం డిమాండ్ పెరగడం వల్ల ఈ భారీ పెరుగుదల కనిపిస్తోంది.
ముఖ్యంగా వెండి ధరలు (Gold and silver)చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా 20 వేల రూపాయలు పెరిగింది. నేడు కిలో వెండిపై మరో వెయ్యి రూపాయలు పెరగడంతో మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర 1,27,650 రూపాయలు కాగా, 24 క్యారట్ల ధర 1,39,250 రూపాయలకు చేరింది.
ఇక వెండి ధర విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఏకంగా 2,45,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో వెండి ధర 2,34,000 రూపాయలుగా ఉంది. పండుగలు, శుభకార్యాల సీజన్ కావడంతో ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పెడుతోంది.
