Gold
బంగారం(Gold)… ప్రస్తుతం ఈ పేరు చెబితే చాలు సామాన్య ప్రజలు బాబోయ్ అంటున్నారు. అందులోనూ మధ్యతరగతి ప్రజల గుండెల్లో గోల్డ్ పేరు వింటే చాలు దడ పడుతోంది. రోజు రోజుకూ చిరుతలా పరిగెడుతున్న బంగారం ధరలు చూసి వాళ్ళకు నిద్ర కరువైంది. ఈ గోల్డ్(Gold) రష్ ఇప్పట్లో ఆగే అవకాశాలు కనిపించడం లేదు. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు మిడిల్ క్లాస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇప్పటికే లక్ష రూపాయలను దాటేయడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయానికి సుమారు 78 వేలు ఉన్న బంగారం ధర.. ఇప్పుడు ఏకంగా లక్షా 30 వేలకు చేరింది. ఈ ఏడాది ఇప్పటిదాకా పసిడి ధర 67 శాతం పెరిగింది. బంగారం రేటు రెండేళ్లలో డబుల్ అయిపోతే… వెండి మాత్రం ఏడాదిలోపే డబుల్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. జనవరిలో దాదాపు 89 వేలు ఉన్న వెండి ధర.. ఇప్పుడు ఏకంగా లక్షా 85 వేలకు చేరింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టిన టారిఫ్ వార్‌తో.. ప్రంపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి మరింత పెరిగిపోయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశ్చిమాసియాలో భగ్గుమన్న ఉద్రిక్తతలతో.. అప్పటికే ఎగబాకిన రేట్లకు వాణిజ్య యుద్ధం మరింత ఆజ్యం పోసింది. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు అందరూ పరుగులు తీస్తున్నారు.
ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయంగా ఔన్స్ 2 వేల 600 డాలర్లు ఉండగా.. అంతకంతకూ పెరుగుతూ ఇప్పుడు 4 వేల190 డాలర్ల ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరింది. అంటే 10 నెలల్లో ఏకంగా 61 శాతం ధర పెరిగింది. దీనికి తోడు ఇప్పుడు అమెరికా–చైనా మధ్య టారిఫ్ యుద్ధం దీనికి మరింత ఆజ్యం పోసినట్టయింది. అదే సమయంలో గత కొన్నేళ్లుగా పసిడి ఉత్పత్తి మందగించి.. భూగర్భ నిల్వలు అడుగంటుతున్నాయి. అటు ఆభరణాల డిమాండ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, యుద్ధ భయాలతో పాటు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి.
సరఫరా మందగించి.. డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడమే గోల్డెన్ రన్‌కు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం ఈ ఆర్థిక అనిశ్చితులకు తెరపడే సూచనలు కనిపించడం లేదు. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం 2026లో ఔన్స్ బంగారం ధర 5 వేల డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇండియాలో తులం బంగారం ధర ఏకంగా లక్షా 75 వేలు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.