Silver: బంగారం బాటలోనే వెండి పరుగులు..మీరూ అప్పుడు కొనలేదని ఇప్పుడు ఫీలవుతున్నారా?

Silver: ఒకప్పుడు వెండిని కేవలం ఆభరణాలకే వాడేవారు, కానీ ఇప్పుడు అది పరిశ్రమల అవసరానికి కీలకమైంది.

Silver

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే కొన్ని దశాబ్దాలుగా వెండిని కేవలం పట్టీలు, పూజా సామాగ్రికి మాత్రమే పరిమితం చేశారు. బంగారం రేటు ఎక్కడో ఉంది, వెండి తక్కువ ధరకే దొరుకుతుంది కదా అని చాలా మంది దాని పెట్టుబడిని నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. 2025లో బంగారం కంటే వెండి రేటు వేగంగా పెరుగుతుండటం చూసి సామాన్యులే కాదు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు వేలల్లో ఉన్న వెండి ధర(Silver) ఇప్పుడు కేజీ రెండు లక్షల మార్కును తాకడం చూసి షాక్ అవుతున్నారు.

బంగారం వెండి ధరల(Silver) గురించి ఒకసారి గతాన్ని తవ్వుకుంటే.. మనకు ధరల పెరుగుదల ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. 1980ల్లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 1,300 రూపాయలు ఉండగా, కేజీ వెండి ధర సుమారు 2,700 రూపాయలు ఉండేది. 2000ల్లో బంగారం 4,400 రూపాయలు ఉంటే, వెండి కేజీ 8,000 రూపాయల లోపే ఉండేది.

2020 కరోనా సమయంలో బంగారం 48,000 రూపాయలు ఉంటే, వెండి 40,000 రూపాయల స్థాయిలో ఉండేది. నేడు అంటే డిసెంబర్ 23, 2025 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,34,000 రూపాయలు దాటిపోగా, కేజీ వెండి ధర ఏకంగా 2,19,000 రూపాయలకు చేరి రికార్డు సృష్టించింది. అంటే కేవలం ఐదేళ్లలోనే వెండి ధర దాదాపు 5 రెట్లు పెరిగింది.

Silver

వెండి రేటు(Silver) ఎందుకు ఇంతలా పెరుగుతోంది అంటే.. ఒకప్పుడు వెండిని కేవలం ఆభరణాలకే వాడేవారు, కానీ ఇప్పుడు అది పరిశ్రమల అవసరానికి కీలకమైంది. మీరు వాడే స్మార్ట్‌ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు ప్రతి దాంట్లో వెండిని వాడుతున్నారు. సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి పాత్ర కీలకం. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతుండటంతో వెండికి డిమాండ్ భారీగా పెరిగింది.

వెండిని మైనింగ్ చేయడం ద్వారా వచ్చే ఉత్పత్తి కంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం, అమెరికా డాలర్ విలువ తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఇప్పుడు సామాన్యులు వెండిని కొనలేకపోయినా, కనీసం అప్పుడే కొని ఉంటే బాగుండేది అని బాధపడుతున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version