Gold Rate
బంగారం, వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకునే సామాన్య ప్రజలకు వాటి ధరలు(Gold Rate) రోజురోజుకు షాక్ కొడుతున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అయితే, ఈ ధరల పెరుగుదల ఇక్కడితో ఆగిపోయేలా లేదు. వచ్చే నెల అంటే జనవరిలో గోల్డ్, సిల్వర్ రేటు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఈ ధరల (Gold Rate)పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions) పెరగడం వల్ల ఇన్వెస్టర్లు (పెట్టుబడిదారులు) అంతా సురక్షితమైన ఆస్తుల వైపు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో నష్టాలు రాకుండా ఉండాలంటే బంగారం వారికి ఒక సేఫ్ హెవెన్ (Safe Haven) లా కనిపిస్తోంది. అంటే, ఎటువంటి సంక్షోభం వచ్చినా బంగారంలో పెట్టిన డబ్బు సురక్షితంగా ఉంటుంది.
ఇక రెండో ప్రధాన కారణం ఏమిటంటే, డాలర్‌తో పోలిస్తే మన రూపాయి బలహీనపడటం. రూపాయి బలహీనపడినప్పుడు బంగారం ధరలు పెరగడం అనేది మన మార్కెట్‌లో సర్వసాధారణం. ఈ రెండు బలమైన కారణాల వల్ల ఇన్వెస్టర్లు ఇప్పట్లో బంగారంపై పెట్టుబడులను విరమించుకునేలా కనిపించడం లేదు. అందుకే వచ్చే ఏడాది జనవరిలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అదే జరిగితే, న్యూ ఇయర్ లేదా సంక్రాంతి పండుగకు నగలు, వెండి వస్తువులు కొనుగోలు చేయాలనుకునే సామాన్య ప్రజలకు ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బే. ఈ ధరలు చూస్తే, సంక్రాంతికి బంగారం పట్టుకోలేం అనిపిస్తుంది.
సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు ఉదయం 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.820 పెరిగింది. అదే విధంగా 22 క్యారట్ల బంగారంపై రూ.750 పెరిగింది. ఒకే రోజు ఇంత భారీగా ధర పెరగడం అనేది సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. అక్కడ ఔన్సు గోల్డ్ ఏకంగా 32 డాలర్లు పెరిగి, ప్రస్తుతం 4,325 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇక వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.3వేలు పెరిగింది. ఇది దేశీయ మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం ధర బాగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,23,500 గా ఉంది. అదే విధంగా 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర ఏకంగా రూ.1,34,730 కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు బాగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,650 కాగా, 24 క్యారట్ల ధర రూ.1,34,880 కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,23,500 కాగా, 24 క్యారట్ల ధర రూ.1,34,730 కు చేరింది.
బంగారంతో పాటు వెండి ధరలు (Gold Rate)కూడా సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కిలో వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర ఏకంగా రూ.2,13,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు కాస్త తక్కువగా రూ.2,09,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,13,000 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న ధరలు(Gold Rate) మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. బంగారం, వెండి రేట్లు మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి రోజంతా మారుతూ ఉంటాయి. పెట్టుబడులు పెట్టే ముందు లేదా కొనుగోలు చేసే ముందు ఈ విషయాన్ని గమనించడం చాలా అవసరం. నిపుణుల అంచనా ప్రకారం, ఈ పెరుగుదల జనవరిలో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
