Gold : అక్కడ టన్నుల టన్నుల బంగారం ..భారత్ అవసరాలు తీరుస్తుందా?

Gold : దేశం మొత్తం మీద దిగుమతి చేసుకునే బంగారంతో పోలిస్తే ఒక చిన్న అంకె కావచ్చు, కానీ దేశీయంగా ఉత్పత్తిని పెంచే దిశగా ఇది ఒక కీలకమైన, ఆశాజనకమైన అడుగు అనే అంటున్నారు ఆర్థికవేత్తలు.

Gold

భారతదేశానికి చెందిన భౌగోళిక నిపుణులు ఇటీవల ఒడిశాలో జరిపిన అన్వేషణ, దేశ భవిష్యత్తును బంగారు బాట పట్టించేలా ఉంది. పశ్చిమ ఒడిశాలోని పలు జిల్లాల్లో సుమారు 20 మెట్రిక్ టన్నుల విలువైన బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) బృందం ధృవీకరించింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది, ఎందుకంటే ఇది భారత్ మైనింగ్ రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలకనుంది.

ఈ బంగారు(Gold)నిక్షేపాలు ముఖ్యంగా దేవ్‌ఘర్, సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, కియోంఝర్, అంగుల్ వంటి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వీటితో పాటు, మయూర్‌భంజ్, మల్కనగిరి, సంబల్పూర్, బౌధ్ జిల్లాల్లో కూడా అన్వేషణలు ఇంకా కొనసాగుతున్నాయి. అధికారిక గణాంకాలు ఇంకా వెలువడకపోయినా.. ఈ నిల్వలు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఇది దేశం మొత్తం మీద దిగుమతి చేసుకునే బంగారంతో పోలిస్తే ఒక చిన్న అంకె కావచ్చు, కానీ దేశీయంగా ఉత్పత్తిని పెంచే దిశగా ఇది ఒక కీలకమైన, ఆశాజనకమైన అడుగు అనే అంటున్నారు ఆర్థికవేత్తలు.

ఈ ఆవిష్కరణ ఒకవైపు ఆశను నింపినా, మరోవైపు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. తుది నివేదికలు, ప్రయోగశాల విశ్లేషణల తర్వాతే వాణిజ్య సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తారు. భవిష్యత్తులో పారదర్శకమైన వేలం, పర్యావరణ,సామాజిక ప్రభావ అధ్యయనాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ విజయవంతమైతే, ఒడిశాలో ఈ బంగారు నిక్షేపాల (Odisha gold reserves)ఆవిష్కరణ భారతదేశ మైనింగ్ వ్యూహంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడమే కాకుండా, స్థానిక ప్రజలకు ఆర్థికంగా ఒక గొప్ప వరం కాగలదని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Gold Price

ఈ అద్భుతమైన ఆవిష్కరణను వాణిజ్యపరంగా సాకారం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ (OMC) తో పాటు GSI కలిసి వేగంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే, దేవ్‌ఘర్ జిల్లాలోని మొదటి బంగారు మైనింగ్ బ్లాక్‌ను వేలానికి సిద్ధం చేసే ప్రక్రియ మొదలైంది. నిక్షేపాల నాణ్యత, తవ్వకాల సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ప్రస్తుతం G3 నుంచి G2 స్థాయిల వరకు వివరణాత్మకమైన డ్రిల్లింగ్ మరియు నమూనా సేకరణ పనులు జరుగుతున్నాయి.

ఈ బంగారు (gold)గనులను వాణిజ్యపరంగా తవ్వితే, ఒడిశా రాష్ట్రం యొక్క ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ఇవి స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి, మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. ఇప్పటి వరకు ఇనుప ఖనిజం, బాక్సైట్, క్రోమైట్‌లకు ప్రసిద్ధి చెందిన ఒడిశా, ఇకపై బంగారు నిల్వలకు కూడా ప్రధాన కేంద్రంగా మారుతుంది. ఇది భారతదేశం బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని కొంతవరకు తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలాన్ని ఇస్తుంది. ఒడిశాలో ఇప్పటికే భారతదేశంలోని క్రోమైట్‌లో 96%, బాక్సైట్‌లో 52%, ఇనుప ఖనిజ నిల్వలు 33% ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి బంగారు నిల్వలు కూడా వచ్చి చేరడం ఒడిశా ఖనిజ సంపదకు పట్టాభిషేకం లాంటిదని ఆర్ధిక వేత్తలు అంటున్నారు.

Also Read: Bollywood :హీరోయిన్స్‌కు ఎర్రతివాచి..హీరోలకు మాత్రం నో ఛాన్స్..బాలీవుడ్‌లో ఎందుకిలా?

Exit mobile version