IBomma: ఐ బొమ్మ నుంచి ఆ మెసేజ్ ఎలా వచ్చింది? మెసేజులో ఏముంది?

IBomma: రవి అరెస్టయిన రెండు రోజుల తర్వాత, ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో ఒక మెసేజ్ ప్రత్యక్షమవడం మరింత చర్చకు దారి తీసింది.

IBomma

తెలుగు సినిమా పరిశ్రమకు వందల కోట్ల రూపాయల నష్టం కలిగించిన ప్రముఖ పైరసీ సైట్ల (IBomma)నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పైరసీని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, తనను పట్టుకోగలరా అంటూ రవి విసిరిన ‘దమ్ముంటే పట్టుకోండి’ ఛాలెంజ్‌ను స్వీకరించి అతన్ని అరెస్ట్ చేయడంతో కేసు మరింత సంచలనం సృష్టించింది.

ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న ఇమ్మడి రవిని విచారించగా, అతని పైరసీ నెట్‌వర్క్ యొక్క విస్తృతి, ఆర్థిక లావాదేవీల గురించి నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి.

రవి వద్ద దాదాపు 21 వేలకు పైగా సినిమాల భారీ డేటా నిల్వ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాక, ఇతర భాషల చిత్రాలు కూడా ఉన్నాయి.

పైరసీ సైట్‌లను వినియోగించిన సుమారు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటా రవి వద్ద ఉంది. ఈ డేటాను డార్క్ వెబ్‌లో అమ్మి భారీగా సంపాదించడానికి రవి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.

IBomma

పైరసీ ద్వారా వచ్చిన ప్రధాన ఆదాయం, వెబ్‌సైట్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ద్వారానే వచ్చినట్లు విచారణలో తేలింది. ఈ ఇల్లీగల్ ప్రమోషన్ల ద్వారానే రవి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు.

రవి వద్ద ఉన్న టెక్నికల్ వివరాల ఆధారంగా, ఐ బొమ్మ(IBomma) , బొప్పమ్ (Bompam) వంటి ప్రధాన పైరసీ వెబ్‌సైట్‌లను రవితోనే క్లోజ్ చేయించామని హైదరాబాద్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

విశాఖపట్నం స్వస్థలం అయిన రవి, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్, ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. మొదట్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా, ఆ తర్వాత సొంతంగా కంపెనీ సీఈఓ స్థాయి వరకు ఎదిగి, వ్యక్తిగత కారణాలు, వ్యాపార వైఫల్యాల వల్ల పైరసీ మార్గాన్ని ఎంచుకున్నాడు.

రవి తన భార్యతో విభేదాలు కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై చర్చించడానికి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాడనే ముఖ్యమైన సమాచారాన్ని అతని భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా పక్కా ప్లాన్‌తో హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్‌పల్లిలోని అతని ఫ్లాట్‌లో పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

రవి అరెస్టయిన రెండు రోజుల తర్వాత, ఐ బొమ్మ (IBomma)వెబ్‌సైట్‌లో ఒక మెసేజ్ ప్రత్యక్షమవడం మరింత చర్చకు దారి తీసింది. ఆ మెసేజ్ సారాంశం ఇలా ఉంది.

“ఇటీవల మా గురించి మీడియాలో వినే ఉంటారు. మీరు మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. ఈ సేవలను నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం మరియు క్షమాపణలు కోరుతున్నాం.”

ఈ పోస్ట్‌తో ఐ బొమ్మ (IBomma)సైట్ పూర్తిగా క్లోజ్ అయినట్టే అని స్పష్టమవుతోంది. అయితే, రవి పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు ఈ మెసేజ్ ఎలా వచ్చింది అనే దానిపై రెండు ప్రధాన చర్చలు నడుస్తున్నాయి.

పోలీసులు టెక్నికల్ వివరాలను ఉపయోగించి, రవితోనే ఈ వీడ్కోలు సందేశాన్ని పెట్టించి సైట్‌ను పూర్తిగా మూసివేయించారా? లేదా, రవి అరెస్ట్‌తో అప్రమత్తమైన బయటి దేశాల్లో ఉన్న అతని టెక్నికల్ టీమ్, లీగల్ సమస్యలు రాకుండా వెబ్‌సైట్‌ను శాశ్వతంగా మూసివేసి, ఈ సందేశాన్ని పోస్ట్ చేసిందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఈ అంశంపై పోలీసులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోయినా కూడా, ఐ బొమ్మ సేవలు శాశ్వతంగా నిలిచిపోవడం సినీ పరిశ్రమకు గొప్ప ఊరటనిచ్చింది. కాగా ఇమ్మడి రవి అరెస్ట్ కేవలం ఒక వ్యక్తి అరెస్ట్ మాత్రమే కాదు, భారీ పైరసీ సామ్రాజ్య పతనానికి నాంది. అతని వద్ద ఉన్న యూజర్ల డేటా, బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిన కోట్లు, పైరసీ నెట్‌వర్క్ కూల్చివేత అంశాలు ఈ కేసును అత్యంత కీలకమైన సైబర్ క్రైమ్ కేసుగా నిలబెడుతున్నాయి.

Saudi Arabia: సౌదీ అరేబియాలో 45 మంది సజీవదహనం ..మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే

Exit mobile version