Akhanda 2 Ticket
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2′ సినిమాకు సంబంధించి వివాదాలు ఆగడం లేదు. మొన్నటి వరకూ విడుదలపై రకరకాల గందరగోళాలు ఏర్పడి చివరకు రేపు రిలీజువతుందని బాలయ్య ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు, తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మరో సంచలన తీర్పు సినీ వర్గాలను, అభిమానులను గందరగోళంలో పడేసింది.
హైకోర్టు సంచలన తీర్పు ఏమిటంటే?..’అఖండ 2’ సినిమా కోసం పెంచిన టికెట్(Akhanda 2 Ticket ) ధరలకు సంబంధించిన ప్రభుత్వ జీవోను (Government Order) తెలంగాణ హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది. అంటే, సినిమా టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం నిర్మాతలకు లేకుండా పోయింది. అంతేకాదు, పెరిగిన ధరలతో నిర్వహించాలనుకున్న ప్రీమియర్ షోలను కూడా కోర్టు రద్దు చేసింది. దీని వల్ల డిసెంబర్ 12 నుంచి ఈ సినిమా సాధారణ (నార్మల్) టికెట్ ధరలతోనే థియేటర్లలో ప్రదర్శితం కానుంది.
సమస్యంతా ఇక్కడే మొదలైంది. హైకోర్టు తీర్పు వెలువడకముందే, అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. చాలా మంది అభిమానులు , ప్రేక్షకులు సినిమాపై ఉన్న అంచనాలతో, కోర్టు రద్దు చేసిన పెరిగిన టికెట్ ధరలకే బుకింగ్స్ చేసుకున్నారు.
ఇప్పుడు ధరలు తగ్గడంతో..ఎక్కువ రేటు పెట్టి అఖండ 2 టికెట్ (Akhanda 2 Ticket )కొన్న ఆడియన్స్ పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఉదాహరణకు, ఒక టికెట్‌కు రూ.50 నుంచి రూ.100 వరకు ఎక్కువ చెల్లించినట్లయితే, ఆ అదనపు మొత్తాన్ని బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు (లేదా థియేటర్ యాజమాన్యం) వారికి తిరిగి చెల్లిస్తాయా? ఈ విషయంలో ‘అఖండ 2’ మేకర్స్ లేదా థియేటర్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఇదే విషయంపై తమ అనుమానాలు వ్యక్తం చేస్తూ, “మా డబ్బులు వెనక్కి ఇవ్వాలి” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో, టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లు లేదా యాజమాన్యం అదనపు మొత్తాన్ని ఆడియన్స్‌కు రీఫండ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, నిర్మాతల నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ వివాదాల మధ్యన సినిమా విడుదల కావడం గమనార్హం.
