Bigg Boss
బిగ్ బాస్(Bigg Boss) తెలుగు 9వ సీజన్ మొదటి వారం నుంచే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేషన్ తర్వాత, రెండో వారం నామినేషన్ ప్రక్రియ హౌస్‌లో తీవ్రమైన ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రత్యేకించి, ‘మాస్క్ మ్యాన్’ హరీష్‌ను హౌస్‌మేట్స్ ఏకతాటిపైకి వచ్చి టార్గెట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హౌస్‌లోని ఈ నాటకీయ పరిణామాలు, హరీష్‌ను ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ వారం నామినేషన్ ప్రక్రియలో కెప్టెన్ సంజనను మినహాయించి, మిగతా హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేయాలని బిగ్ బాస్(Bigg Boss) సూచించాడు. ఈ ప్రక్రియలో ఎక్కువమంది హరీష్‌నే నామినేట్ చేశారు. హరీష్‌తో పాటుగా భరణి, మనీష్, ప్రియ, పవన్, ఫ్లోరా సైనీ, తనూజ, రీతూ, సుమన్ శెట్టి కూడా నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. అయితే, హరీష్‌ను ఇంతమంది టార్గెట్ చేయడానికి గల కారణాలు అతని విచిత్రమైన ప్రవర్తన, మరియు గత వారం నాగార్జున ముందు మాస్క్‌ను తీసివేసినప్పుడు అతని గేమ్ ప్లాన్‌పై వచ్చిన కామెంట్లే అని తెలుస్తోంది.
హౌస్‌మేట్స్ అందరూ తనకు వ్యతిరేకంగా ఉన్నారనే భావనతో హరీష్ నిరాహార దీక్షకు దిగాడు. “ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండలేను, ఇంటి నుంచి వెళ్లిపోతాను” అని తెగేసి చెప్పాడు. బిగ్ బాస్(Bigg Boss) కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మాట్లాడినా, హరీష్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో హరీష్‌ను చూసుకునే బాధ్యతను రాము రాథోడ్‌కు అప్పజెప్పాడు బిగ్ బాస్. హరీష్ అన్నం తినడానికి, నీరు తాగడానికి నిరాకరిస్తున్నాడు. రాము మరియు ఇతర హౌస్‌మేట్స్ ఎంత నచ్చజెప్పినా, హౌస్ నుంచి వెళ్లిపోయేంత వరకు తాను ఫుడ్ తిననని హరీష్ స్పష్టం చేశాడు.
గత వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున హరీష్‌ను మాస్క్ తీసేయమని అడిగాడు. ఆ సమయంలో హరీష్ తన ప్రవర్తన, మాటలపై వివరణ ఇచ్చినా, “రెడ్ ఫ్లవర్, ఆడంగోళ్లు” వంటి అతని వ్యాఖ్యలు ప్రేక్షకులకు వీడియోతో సహా చూపించడంతో హరీష్‌పై వ్యతిరేకత పెరిగింది. ఇది హరీష్ గేమ్ ప్లాన్‌లో భాగమేనా, లేక నిజంగానే అతను హౌస్‌మేట్స్ ప్రవర్తనతో నిరాశ చెందాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది ప్రేక్షకులు ఇది హరీష్ సింపతీ కోసం ఆడుతున్న గేమ్ అని భావిస్తున్నారు. ఈ వారం ప్రేక్షకుల ఓట్లు ఎలా పడతాయనేది ఆసక్తికరంగా మారింది.
మరి ఈ వారం హరీష్ ఎలిమినేట్ అవుతాడా? లేదా అతని నిరాహార దీక్ష వల్ల బిగ్ బాస్ కొత్త నిర్ణయం తీసుకుంటాడా? ఈ నాటకీయత బిగ్ బాస్ గేమ్‌లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.