Mogilaiah: పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. వైరల్ అవుతున్న వీడియో

Mogilaiah: పద్మశ్రీ పొందిన వ్యక్తి ముఖం కూడా మనలోని కొందరికి ఖాళీ గోడలా కనిపిస్తోందా అని డైరెక్టర్ వేణు ఊడుగుల ఆవేదన వ్యక్తం చేశారు.

Mogilaiah

తెలంగాణ గర్వించదగ్గ మెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య(Mogilaiah)కు హైదరాబాద్ నగరంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆయన గౌరవార్థం హైదరాబాద్‌లోని ఒక ఫ్లై ఓవర్ పిల్లర్‌పై గీసిన ఆయన చిత్రపటాన్ని కొందరు వ్యక్తులు దారుణంగా అవమానించారు.

ఆ చిత్రపటంపై రాజకీయ నాయకుల పోస్టర్లు, సినిమా పోస్టర్లు అంటించడంతో మొగిలయ్య (Mogilaiah)ముఖం కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని గమనించిన మొగిలయ్య ఎంతో బాధపడ్డారు. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక, ఆయనే స్వయంగా తన బొమ్మపై ఉన్న పోస్టర్లను ఒక్కొక్కటిగా తొలగించడం అందరినీ కలిచివేస్తోంది.

Mogilaiah

ఈ హార్ట్ టచింగ్ వీడియోను ప్రముఖ డైరెక్టర్ వేణు ఊడుగుల సోషల్ మీడియాలో షేర్ చేశారు. పద్మశ్రీ పొందిన వ్యక్తి ముఖం కూడా మనలోని కొందరికి ఖాళీ గోడలా కనిపిస్తోందా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కేవలం మొగిలయ్య గారికి జరిగిన అవమానం మాత్రమే కాదని, మన సాంస్కృతిక స్పృహ ఎంత బలహీనంగా ఉందో చెప్పే ఒక నిశ్శబ్ద సంకేతం అని ఆయన విమర్శించారు. మనలోని నిర్లక్ష్యానికి ఈ సంఘటన ఒక నిలువెత్తు సాక్ష్యమని పేర్కొంటూ, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఈ విషయాన్ని ట్యాగ్ చేశారు.

ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలంగాణ జానపద కళను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మొగిలయ్య లాంటి గొప్ప కళాకారుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో భీమ్లా నాయక్ సినిమా ద్వారా మొగిలయ్య పేరు మారుమోగిపోయింది.

ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో గౌరవించినా, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మరియు అధికారుల నుంచి ఇలాంటి నిర్లక్ష్యం ఎదురుకావడం విచారకరమని కళాభిమానులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version