Rajasab
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సినిమా మరోసారి వాయిదా పడబోతోందనే వార్తలు సినీ వర్గాలలో, సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ హారర్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్, ఇప్పుడు 2026 సంక్రాంతి బరి నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభాస్ సినిమాల విడుదల తేదీలు వాయిదా పడడం ‘బాహుబలి’ నుంచి దాదాపుగా ఒక అలవాటుగా మారింది. ‘రాజాసాబ్(Rajasab)’ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది.
మొదట ఈ మూవీని 2025 సమ్మర్‌లో (ఏప్రిల్) విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.అయితే ప్రభాస్ ఇతర మూవీల రిలీజ్ వల్ల.. ఆ తర్వాత సెప్టెంబర్‌లో విడుదల చేయాలని అనుకున్నారు.
చివరకు, ఇతర సినిమాల క్లాష్ (ముఖ్యంగా ‘ఓజీ’ విడుదల)ను దృష్టిలో ఉంచుకుని, 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
అయితే తాజా వాయిదాకు కారణం భారీ వీఎఫ్‌ఎక్స్ (VFX) పని అని తెలుస్తోంది. అంటే సంక్రాంతి రేస్ నుంచి ఈ సినిమా తప్పుకోవడానికి ప్రధాన కారణం పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో జరుగుతున్న ఆలస్యమని తేలింది.
‘రాజాసాబ్’ సినిమా భారీ గ్రాఫిక్స్‌తో రూపొందుతోంది. సమాచారం ప్రకారం, ఈ మూవీలో 3000లకు పైగా సీజీ (CG) షాట్స్ ఉన్నాయట. ఈ షాట్లకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఇంకా చాలా పెండింగ్‌లో ఉండటం వల్ల ఫైనల్ వెర్షన్ నాణ్యతతో విడుదల కావడానికి అనుకున్న జనవరి 9 గడువు సరిపోకపోవచ్చు.
దీంతోనే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన టీజీ విశ్వప్రసాద్ గతంలో మాట్లాడుతూ, మొదట్లో నియమించిన సీనియర్ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ పని తీరు సరిగా లేకపోవడం, ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కూడా జాప్యానికి కారణమైందని వెల్లడించారు. దీనివల్లే కొత్త వీఎఫ్‌ఎక్స్ టీమ్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వరుసగా వాయిదా పడుతున్న ఈ వార్తలతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఇంకా ఎన్నిసార్లు ఇలా వాయిదాలు వేస్తూ ఉంటారంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జనవరి 9న సంక్రాంతి పండగకు ప్రభాస్‌ను థియేటర్లలో చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు ఇది పెద్ద షాక్‌గా మారింది.
త్వరలోనే ఈ వాయిదాపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ‘రాజాసాబ్’ సినిమా సమ్మర్ 2026కు వాయిదా పడనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
