Bollywood
సినిమా అంటే ఒక మాయ. ఆ మాయలో మునిగి తేలే ప్రేక్షకులందరికీ బాలీవుడ్(Bollywood)ఒక కలల ప్రపంచం. కానీ, ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టే దక్షిణాది నటీనటులకు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. తమ అందం, అభినయంతో అక్కడి ఆడియన్స్‌ను ఈజీగా ఆకట్టుకునే హీరోయిన్స్‌కు ఎర్రతివాచి పరుస్తుంది బాలీవుడ్. కానీ, కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మన హీరోలు మాత్రం అక్కడి ఎంట్రన్స్ గేట్ వద్దే ఆగిపోతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతుంది? మన మెగాస్టార్ చిరంజీవి నుంచి ఎన్టీఆర్ లాంటి స్టార్‌లకు కూడా ఈ పరిస్థితి ఎందుకు ఎదురవుతోంది?
దక్షిణాది హీరోయిన్స్ బాలీవుడ్(Bollywood )లో విజయం సాధించడానికి మెయిన్ రీజన్.. వారి పాత్రలకు లాంగ్వేజ్, కల్చర్ అడ్డుకాకపోవడమే సినిమా కథలో హీరోయిన్ పాత్ర గ్లామర్, అందం, డాన్స్, నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. లాంగ్వేజ్ లిమిట్స్ వారికి పెద్దగా సమస్య కాదు, ఎందుకంటే వారి రోల్స్ ఎక్కువగా ఎమోషన్స్, రొమాంటిక్ సన్నివేశాలను ప్రదర్శించడానికి ప్రాధాన్యత ఇస్తాయి. హిందీ డబ్బింగ్ ఇచ్చినా, వారి అందం, యాక్షణ్ ఫ్యాషన్ సెన్స్ యూనివర్సల్‌గా అందరినీ ఆకట్టుకుంటాయి. శ్రీదేవి, జయప్రద, రష్మిక మందన్న వంటి నటీమణులు తమ అందం, ప్రతిభతో దేశవ్యాప్తంగా అలాగే గుర్తింపు పొందారు.
హీరోల విషయంలో ఈ సమీకరణం పూర్తిగా మారిపోతుంది. ఒక హీరో యొక్క సక్సెస్ అతని మాస్ ఇమేజ్, డైలాగ్ డెలివరీ, హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు చిరంజీవి లాంటి మాస్ హీరో యొక్క బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపించొచ్చు.
ఒక హీరో తన సొంత భాషలో మాట్లాడే విధానం, కామెడీ టైమింగ్, మాస్ డైలాగ్స్ పలికే తీరు వారి అభిమానులతో బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఉత్తర భారతంలో పెరిగిన ఆడియన్స్ తెలుగు హీరోల మాస్ మ్యానరిజమ్స్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు లేదా వాటితో కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. దీనికి తోడు, హిందీ డిక్షన్, డైలాగ్ డెలివరీ వంటివి దక్షిణాది హీరోలకు మెయిన్ మైనస్‌గా మారతాయి.
బాలీవుడ్‌లో నెపోటిజం ప్రభావం చాలా బలంగా ఉంది. అక్కడ వారసత్వ నటులకు సులభంగా అవకాశాలు దొరుకుతాయి. ఒకవేళ మొదటి సినిమా ఫ్లాప్ అయినా, రెండో, మూడో అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ దక్షిణాది నుంచి వెళ్లే హీరోలకు అలాంటి అదృష్టం దక్కదు. ఒకటో, రెండో సినిమాలు ఫ్లాపైతే మళ్లీ అవకాశం దొరకడం కష్టం. అలాగే, బాలీవుడ్‌లో ఇప్పటికే ఉన్న స్టార్ హీరోలు, వారి ఫ్యాన్ బేస్ చాలా బలంగా ఉంటుంది. బయటి హీరో వచ్చి వారి మార్కెట్‌ను దెబ్బతీస్తారని నిర్మాతలు, దర్శకులు పెద్దగా రిస్క్ తీసుకోరు.
మరి టాలీవుడ్ బాలీవుడ్‌ను ఎందుకు ఆహ్వానిస్తుందంటే..టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులను, ముఖ్యంగా విలన్లను, క్యారెక్టర్ ఆర్టిస్టులను ఆహ్వానించడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు బాలీవుడ్ నటులు కొత్తగా, వైవిధ్యంగా కనిపిస్తారు. ఇది సినిమాకు ఒక కొత్త కళను తెచ్చిపెడుతుంది.
ఒక బాలీవుడ్ నటుడిని విలన్‌గా తీసుకుంటే, ఆ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి ప్రచారం లభిస్తుంది. బాలీవుడ్ నటులు విలన్ పాత్రలు చేస్తే, అది తెలుగు హీరోల స్టార్‌డమ్‌కు ఎలాంటి ముప్పు కలిగించదు. పైగా, సినిమా స్థాయిని పెంచడానికి దోహదపడుతుంది.
మొత్తంగా చూస్తే, ఒక హీరోయిన్ విజయం ఆమె బ్యూటీ, గ్లామర్‌పై ఆధారపడితే, ఒక హీరో విజయం అతని మాస్ ఇమేజ్, కల్చర్, లాంగ్వేజ్‌తో పాటు ఎక్స్‌ప్రెసన్స్‌పై ఆధారపడి ఉంటుంది. పాన్-ఇండియా సినిమాలైన ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటివి ఇప్పుడు ఈ అడ్డుగోడలను నెమ్మదిగా తొలగిస్తున్నాయి. అయితే, ఇది ఇంకా ప్రారంభ దశ మాత్రమే. దక్షిణాది హీరోలు బాలీవుడ్‌లో సుస్థిరమైన ప్లేసును సంపాదించుకోవాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది.