Reviews and Ratings
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో పాటు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న మరో మూడు సినిమాలకు సంబంధించి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’ (BookMyShow) లో ఈ సినిమాలకు సంబంధించిన రివ్యూలు , రేటింగ్ (Reviews and Ratings)ఆప్షన్లను డిజేబుల్ చేయాలని కోర్టు ఆదేశించింది.
సాధారణంగా సినిమా విడుదలైన వెంటనే ఆడియన్స్ తమ అభిప్రాయాలను రివ్యూలు, రేటింగ్స్(Reviews and Ratings) రూపంలో తెలియజేస్తుంటారు. అయితే, ఈ మధ్యకాలంలో ‘యాంటీ ఫ్యాన్స్’, కొంతమంది కావాలని సినిమాలను దెబ్బతీసే ఉద్దేశంతో సినిమా చూడకుండానే నెగిటివ్ రేటింగ్స్ ఇస్తున్నారని (రివ్యూ బాంబింగ్), దీనివల్ల భారీ బడ్జెట్ సినిమాల వసూళ్లపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతోందని మేకర్స్ కోర్టును ఆశ్రయించారు.
దీనిపై స్పందించిన కోర్టు, సినీ ఇండస్ట్రీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. చిరంజీవి సినిమాతో పాటు శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు , రవితేజ ..భర్త భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలకు కూడా ఈ తీర్పు వర్తిస్తుంది.
ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మినహా మిగిలిన మూడు ప్రధాన చిత్రాల మేకర్స్ ఈ వెసులుబాటును కోరుతూ కోర్టు నుంచి అనుమతి పొందారు. కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షో ఇప్పటికే ఈ సినిమాల పేజీలలో రివ్యూ , రేటింగ్ ఆప్షన్లను తొలగించింది. అంటే, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత కూడా ఈ ఆడియన్స్‌లో రేటింగ్ ఇచ్చే అవకాశం ఉండదు.
ఈ తీర్పుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మంచి నిర్ణయం అని.. డబ్బులు ఇస్తే ఒకలా లేదంటే మరోలా రివ్యూల ఇచ్చేవారూ కూడా ఉన్నారని..అలాంటి వారికి ఇది మంచి తీర్పు అని అంటున్నారు. అలాగే రివ్యూలను చూసి సినిమాకు వెళ్లే సాధారణ ప్రేక్షకులకు ఇది కొంత ఇబ్బందికరమే అయినా, కావాలని చేసే నెగిటివ్ ప్రచారానికి ఇది అడ్డుకట్ట వేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా యూట్యూబ్ రివ్యూల ద్వారా లబ్ధి పొందే వారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. కేవలం బుక్ మై షో మాత్రమే కాకుండా, ఇతర ప్లాట్‌ఫామ్స్ లో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, ఈ సంక్రాంతి సినిమాల ఫ్యూచర్ ఇప్పుడు కేవలం ప్రేక్షకుల ‘మౌత్ టాక్’ పైనే ఆధారపడి ఉంటుందనడం చాన్నాళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్లే అవుతుందని అంటున్నారు.
Chiranjeevi:చిరు సినిమాకు తెలంగాణ సర్కార్ నుంచీ గ్రీన్ సిగ్నల్..మరి కోర్టు చిక్కుల మాటేంటి?
