Samantha
టాలీవుడ్‌లో కొంతకాలంగా వినిపిస్తున్న గుసగుసలకు తెరదించుతూ, స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తన జీవితంలో ఒక అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు. తన మాజీ భర్త నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న సమంత, ఎట్టకేలకు కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో (ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్) ఏడడుగులు వేశారు.
ఎవరికీ తెలియకుండా, అత్యంత గోప్యత నడుమ ఈ వివాహం జరిగింది. డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఆధ్యాత్మిక కేంద్రమైన ఈషా ఫౌండేషన్ వేదికగా వేద పండితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకకు ఇరువైపులా ఉన్న అత్యంత సన్నిహితులు, అతికొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.
సమంత, దర్శకుడు రాజ్ ఒక ఏడాది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం దర్శకుడు రాజ్ తీసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే మొదలైందని సినీ వర్గాల్లో టాక్ ఉంది. ఆ రిలేషన్‌షిప్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ వారు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
మరోవైపు సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కొత్త బంధం వార్తతో, ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ కపుల్‌గా పిలవబడిన ఆమె వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను, ఆమె ఎదుర్కొన్న సవాళ్లను సినీ అభిమానులు, మీడియా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
సమంత(Samantha) జీవితంలో అత్యంత కీలకం అయిన మొదటి ఘట్టం నాగ చైతన్యతో ఆమె ప్రేమ, పెళ్లి. 2017 అక్టోబర్‌లో వీరిద్దరూ గోవాలో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. ‘ఏ మాయ చేశావే’ సినిమా సెట్‌లో మొదలైన వీరి బంధం, పెళ్లి వరకు వెళ్లి, సినీ పరిశ్రమలో ‘చై-సామ్’గా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది.
అయితే, నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత, 2021 అక్టోబర్‌లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విడాకుల నిర్ణయం భారతీయ సినీ పరిశ్రమలో ఒక పెద్ద సంచలనం. విడాకుల తర్వాత సమంత తన కెరీర్‌ను, జీవితాన్ని ఎలా కొనసాగించాలనే దానిపై ఆమె తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాలు పెద్ద చర్చకు దారి తీశాయి.
విడాకుల తర్వాత సమంత (Samantha)కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో, ఆమె మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్య ఆమె శరీరాన్ని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినా , సమంత ధైర్యంగా చికిత్స తీసుకుంటూనే, ఆ సమయంలో తాను పడిన బాధ, నిరాశ గురించి నిర్మొహమాటంగా మాట్లాడారు. ఈ సవాలును ఎదుర్కొంటూ, ఆమె తన పోరాట పటిమను ప్రపంచానికి చాటి చెప్పారు. వ్యక్తిగత జీవితంలో వైఫల్యం, ఆరోగ్యం విషయంలో సవాలు ఎదురైనా కూడా, పనిని ఆపకుండా ముందుకు సాగడం దేశంలోని ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచింది.
ఇన్ని ఒడిదుడుకుల తర్వాత, సమంత (Samantha)తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆమె ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ వేదికగా ఈ వివాహం చాలా గోప్యంగా, ప్రశాంతంగా జరిగింది. సమంత తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో సెలబ్రెటీలు, ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే దర్శకుడు రాజ్ నిడిమోరుకు కూడా ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. అయితే, రాజ్ మొదటి భార్య శ్యామలి దే ఈ పెళ్లిపై చేసిన ఒక పోస్ట్ పెను సంచలనం సృష్టించింది. “తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులే చేస్తారు” అంటూ ఆమె పెట్టిన షాకింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
