Video
హీరోయిన్ల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపడంతో నటుడు శివాజీ(Video) ఎట్టకేలకు స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరిస్తూ ఒక వీడియో(Video )ను విడుదల చేశారు. ఇటీవల కాలంలో హీరోయిన్లు బహిరంగ ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న అసౌకర్య పరిస్థితులను చూసి, వారు బయటకు వెళ్లినప్పుడు దుస్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతోనే తాను కొన్ని సూచనలు చేయాలనుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఆ సమయంలో తెలియకుండానే రెండు అభ్యంతరకరమైన పదాలు (అన్‌పార్లమెంటరీ వర్డ్స్) వాడానని, ఆ పదాలు దొర్లడం తన తప్పేనని ఒప్పుకున్నారు. తన మాటల వల్ల సినీ పరిశ్రమలోని మహిళలు లేదా మరే ఇతర మహిళల మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు. స్త్రీని ఎప్పుడూ అమ్మవారిలాగే భావిస్తానని, సమాజం మహిళలను తక్కువ చేసి చూసే అవకాశం ఇవ్వకూడదనే ఆవేదనతోనే ఆ మాటలు అన్నానని వివరణ ఇచ్చారు.
దీనికి ముందు శివాజీ ఉపయోగించిన భాషపై తెలంగాణ మహిళా కమిషన్ గట్టిగా స్పందించింది. మహిళలను కించపరిచేలా మాట్లాడటంపై లీగల్ చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు హెచ్చరించింది. పరిశ్రమలో కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గాయని చిన్మయి శ్రీపాద .. మగవారు తమకు నచ్చిన ఆధునిక దుస్తులు ధరిస్తూ మహిళలపై మోరల్ పోలీసింగ్ చేయడం ద్వంద్వ ప్రమాణమని విమర్శించారు.
నటి అనసూయ భరద్వాజ్ కూడా స్పందిస్తూ, మహిళలు ఏం వేసుకోవాలన్నది వారి వ్యక్తిగత నిర్ణయమని, సంస్కృతి పేరుతో ఆంక్షలు విధించడం సరికాదని స్పష్టం చేశారు. నటుడు మంచు మనోజ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులు కూడా ఒక వేదికపై ఇలాంటి భాష వాడటం జుగుప్సాకరమని శివాజీని తప్పుబట్టారు. శివాజీ క్షమాపణలు చెప్పినా, ఈ వివాదం సెలబ్రిటీల బాధ్యతాయుత ప్రసంగాల గురించి ,మహిళల వ్యక్తిగత హక్కుల గురించి సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది.
నిజానికి సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు లేదా సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు పబ్లిక్ వేదికలపై మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌తో పాటు ఇతర రంగాల్లో కూడా ‘ముందు నోరు జారడం.. ఆ తర్వాత సోషల్ మీడియాలో విమర్శలు రాగానే క్షమాపణలు చెప్పడం’ అనేది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.
తాజాగా నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు ఈ ధోరణికి అద్దం పడుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తిని లేదా ఒక వర్గాన్ని పబ్లిక్ వేదికపై అందరి ముందు అవమానించి, ఆ తర్వాత ఒక చిన్న వీడియోతో ‘సారీ’ చెబితే ఆ తప్పు చెరిగిపోతుందా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
ఇది కేవలం శివాజీకి మాత్రమే పరిమితమైన విషయం కాదు. గతంలో బాలకృష్ణ, చలపతి రావు, అలీ వంటి ప్రముఖులు కూడా ఇలాగే మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత ‘అభిమానులను అలరించడానికే అలా అన్నాను’ అని లేదా ‘సరదాగా అన్న మాటలు’ అని సర్దిచెప్పుకోవాల్సి వచ్చింది.
ఈ ‘అపాలజీ కల్చర్(Video)’ (క్షమాపణల సంస్కృతి) వల్ల సమాజంలో ఒక ప్రమాదకరమైన ధోరణి మొదలవుతోంది. ఎవరైనా సరే ఏమైనా మాట్లాడొచ్చు, ఆ తర్వాత ఒక సారీ చెబితే అంతా సర్దుకుంటుంది అనే భావన పెరుగుతోంది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు సామాన్య ప్రజలు, ముఖ్యంగా యువత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఒక సెలబ్రిటీ మహిళలను తక్కువ చేసి మాట్లాడినప్పుడు, అది సమాజంలో ఒక తప్పుడు సందేశాన్ని పంపిస్తుంది.
సెలబ్రిటీలు పబ్లిసిటీ కోసం లేదా ఆవేశంలో మాట్లాడే ప్రతి మాట ఒక ప్రభావం చూపుతుంది. ఏదేమైనా, టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ‘ముందు నోరు జారడం – తర్వాత క్షమాపణలు చెప్పడం(Video)’ అనే పద్ధతిని వీడి, మాట్లాడే ముందే కాస్త సంస్కారంతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇలాంటి వివాదాలు సమాజంలో విద్వేషాన్ని పెంచడమే తప్ప, ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చవు.
