Sperm of dead people
ఇజ్రాయెల్‌లో ఇటీవల డాక్టర్ హదాస్ లెవీ తన భర్త కెప్టెన్ నెతన్యేల్ సిల్‌బర్గ్ మరణించిన 18 నెలల తర్వాత కుమారుడికి జన్మనివ్వడం ద్వారా ఈ మరణానంతరం వీర్యం సేకరణ (PSR – Postmortem Sperm Retrieval) సాంకేతికత మరోసారి అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది. యుద్ధాలు తరచుగా జరిగే ఇజ్రాయెల్‌లో, తమ వంశం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని కుటుంబ సభ్యులు తరచుగా ఆశ్రయిస్తున్నారు.
PSR అనేది మరణించిన వ్యక్తి నుంచి వీర్య కణాల(Sperm)ను సేకరించి, వాటిని భవిష్యత్తులో సంతానోత్పత్తికి ఉపయోగించే ప్రక్రియ. మరణం సంభవించిన తర్వాత 24 నుంచి 36 గంటల్లోపు వీర్య సేకరణ జరగడం అత్యంత కీలకం. ఇజ్రాయెల్ ఆర్మీ, యుద్ధంలో సైనికులు మరణించినప్పుడు, కుటుంబం అనుమతి కోసం వేచి ఉండకుండా, వీర్య కణాలను సేకరించి ఫ్రీజ్ (Cryopreservation) చేస్తుంది. తర్వాత కోర్టు అనుమతి తీసుకుంటుంది.
శస్త్రచికిత్స లేదా సూది ద్వారా వీర్య నాళాలు (Vas Deferens) లేదా వృషణాల (Testes) నుంచి వీర్య కణాల సేకరణ జరుగుతుంది.
ల్యాబ్‌లో వేరుచేసిన వీర్య కణాలను లేదా వృషణ కణజాలం నుంచి కణాలను క్రయోప్రిజర్వేషన్ (Cryopreservation – అతి శీతలీకరణ) చేసి భద్రపరుస్తారు. వీటిని భవిష్యత్తులో IVF (In Vitro Fertilization)తో పాటు, ప్రత్యేకంగా ICSI (Intracytoplasmic Sperm Injection) పద్ధతి ద్వారా అండంలోకి ఇంజెక్ట్ చేసి గర్భం పొందేందుకు వినియోగిస్తారు.
ఇజ్రాయెల్ ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ఉదారమైన చట్టాలను కలిగి ఉంది.2003 నుంచి ఈ ప్రక్రియ ఇజ్రాయెల్‌లో పూర్తిగా చట్టబద్ధం.
మరణించిన వ్యక్తికి ముందుగా అనుమతి ఇవ్వకపోయినా, అతని తల్లిదండ్రులు, భార్య లేదా దీర్ఘకాలిక భాగస్వామి వీర్యం(Sperm) సేకరణకు అనుమతి కోరవచ్చు. ఇది యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు వంశాన్ని కొనసాగించే అవకాశాన్ని ఇస్తుంది.
ఇజ్రాయెల్‌లో డజన్ల కొద్దీ పిల్లలు ఈ విధానం ద్వారా జన్మించినా కూడా, ప్రపంచంలోని చాలా దేశాలు, ముఖ్యంగా భారతదేశం, ఈ విషయంలో సంక్లిష్టమైన వైఖరిని కలిగి ఉన్నాయి.
భారతదేశంలో మరణానంతరం వీర్యం సేకరణకు సంబంధించి ప్రత్యేకమైన, స్పష్టమైన చట్టం ప్రస్తుతం లేదు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, ART (Assisted Reproductive Technology) చట్టం కింద స్పష్టమైన అనుమతి ఇవ్వబడలేదు. మరణించిన వ్యక్తి యొక్క లిఖితపూర్వక అనుమతి (Written Consent) ఉంటేనే కొన్ని సందర్భాల్లో దానిని పరిగణించవచ్చు.
అయితే, ఇజ్రాయెల్ మాదిరిగా తల్లిదండ్రులు లేదా భాగస్వామి కోరికపై ఈ ప్రక్రియను నిర్వహించడం చాలా అరుదు , చాలావరకు కోర్టు తీర్పులపై ఆధారపడి ఉంటుంది. భారతీయ సమాజంలో దీనిపై ఇంకా విస్తృతమైన సామాజిక, సాంస్కృతిక ఆమోదం లభించలేదు.ఈ సాంకేతికతకు మద్దతు ఉన్నా కూడా..నైతిక విమర్శలు కూడా బలంగా ఉన్నాయి.
మరణించిన వ్యక్తికి తండ్రి కావాలనే కోరిక నిజంగా ఉందా? అనేది ప్రధాన ప్రశ్న. అతని అనుమతి లేకుండా, అతని శరీర భాగాలను ఉపయోగించడం సరైనదేనా? అనేది నైతిక సమస్య.తండ్రి లేకుండా పెరిగే పిల్లల మానసిక, సామాజిక సంక్షేమం గురించి విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరణించిన వ్యక్తి యొక్క శరీరాన్ని కేవలం సంతానోత్పత్తికి ఉపయోగించే ఒక వస్తువుగా మార్చడం సరికాదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు.
ఈ టెక్నాలజీ వల్ల ముఖ్యంగా కుటుంబాలకు కలిగే సానుకూలతలు..
వంశం కొనసాగింపు.. అకాల మరణం పాలైన వ్యక్తుల వంశం ఆగిపోకుండా కొనసాగించడానికి ఇది ఒక అవకాశం. ఇజ్రాయెల్‌లో సైనికులకు ఇది దేశభక్తితో ముడిపడిన అంశంగా పరిగణించబడుతోంది.
భార్యకు మానసిక స్థైర్యం.. భర్త మరణించిన తర్వాత, అతని వారసుడిని కనడం అనేది భార్యకు మానసిక స్థైర్యాన్ని, సంతృప్తిని ఇస్తుంది.
జీవిత భాగస్వామి కోరిక.. తన భాగస్వామి యొక్క బిడ్డను కనాలని కోరుకునే దీర్ఘకాలిక భాగస్వామి యొక్క కోరికను నెరవేర్చడానికి ఇది వీలు కల్పిస్తుంది.
మరణానంతరం వీర్యం(Sperm) సేకరణ (PSR) సాంకేతికత అనేది విజ్ఞాన శాస్త్రంలో అద్భుతమైన పురోగతి అయినా కూడా, ఇది నైతిక, చట్టపరమైన ,సామాజిక సవాళ్లను లేవనెత్తుతోంది. ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ సాంకేతికతను మానవతా దృక్పథం నుంచి, జాతీయ భద్రత కోణం నుంచి ఆమోదించినా కూడా, భారతదేశం వంటి దేశాలు ఈ అంశాలపై మరింత విస్తృత చర్చ జరిపి, స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది.
